‘ఆరోగ్య సేతు’లో వివరాలు 30రోజుల్లో ఆటో డిలీట్

కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌లో వివరాలు ఆటో డిలీట్ అయిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న యాప్ వినియోగదారుడి వివరాలు 30 రోజుల్లో డిలీట్ అయిపోతాయి. అదే. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వివరాలైతే 45 నుంచి 60 రోజుల్లో ఆటోమాటిక్ గా డిలీట్ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ కరోనాను ఎదుర్కొనేందుకు డిజైన్ చేసిన సోఫిస్టికేటెడ్ సర్వీలెన్స్ యాప్ అని పిలుస్తారు.
ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. కరోనా సోకిన వారికి దగ్గరలో ఉంటే ఈ యాప్ హెచ్చరిస్తుంది. అంతేకాదు.. వారి లొకేషన్ వివరాలను క్యాప్చర్ చేస్తుందని చెప్పారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని యాప్ రన్ చేస్తున్నట్టు రవిశంకర్ తెలిపారు.
సాధారణంగా కరోనా వైరస్ బాధితులను గుర్తించాలంటే టెస్టులతో మాతమ్రే సాధ్యం. అలాంటిది మన పక్కన ఉన్న వ్యక్తికి వైరస్ ఉందా? లేదో చెప్పలేని పరిస్థితి. ఈ ఆరోగ్య సేతు యాప్ ద్వారా అలాంటి ఆందోళన అక్కర్లేదు. ఇందులో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడి లొకేషన్ ఆధారంగా అది కరోనా హాట్ స్పాట్ అవునో కాదో చెప్పేస్తుంది. యాప్ సూచనలతో మీరు వెళ్లే ప్రదేశం సురక్షితమో కాదో ముందే తెలుసుకోవచ్చు.