అల్లు అర్జున్ ‘పుష‍్ప’ షూటింగ్‌లో తీవ్ర విషాదం

అల్లు అర్జున్ ‘పుష‍్ప’ షూటింగ్‌లో తీవ్ర విషాదం

Updated On : January 29, 2021 / 11:31 AM IST

Pushpa Still Photographer Srinivas Passes Away: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ ‘పుష్ప’. ఈ మూవీ షూటింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్‌ జి.శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన వయసు 54 ఏళ్లు. గురువారం(జనవరి 28,2021) రాత్రి గుండెపోటుతో శ్రీనివాస్ మృతి చెందారు. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చింది. చిత్ర యూనిట్ వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం లేకపోయింది. మార్గం మధ్యలోనే ఆయన చనిపోయారు.

పుష్ఫ మూవీ విడుదల తేదీని గురువారమే(జనవరి 28,2021) అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.

Stylish Star Allu Arjun Pushpa Movie Still Photographer Died In Shooting -  Sakshi

దాదాపు 200 పైగా సినిమాలకు శ్రీనివాస్ పని చేశారు. స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు, కూతుళ్లు. శ్రీనివాస్‌ మృతి పట్ల ‘పుష్ప’ టీమ్ సంతాపం తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు సైతం సంతాపం వ్యక్తం చేశారు.

గతంలోనూ పుష్ప మూవీ యూనిట్‌లో కరోనా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన దర్శకనిర్మాతలు.. షూటింగ్ నిలిపేసి హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఏకంగా స్టిల్ ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మరణించడంతో పుష్ఫ యూనిట్‌లో మరోమారు విషాదం నెలకొంది.

డైరెక్టర్ సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా బన్నీ కనిపించబోతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత డైరెక్టర్ సుకుమార్‌- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప చిత్ర వస్తోంది. ఇందులో హీరో హీరోయిన్లు చిత్తూరు యాసలో మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. తెలుగుతో పాటు మొత్తం 5 భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.