Honey Trapping : విశాఖ నేవీలో హానీ ట్రాప్-మరో 12మంది నేవీ అధికారులు అరెస్ట్

అయితే హనీ ట్రాప్‌ లేదంటే.. మనీ ట్రాప్‌.. నేరుగా ఎదుర్కోలేని పాకిస్థాన్‌.. మన నేవీపై కుట్ర పన్నింది. ఆయుధాలతో చేతగాక.. అమ్మాయిలను అడ్డు పెట్టుకుంటోంది. మరుభూమిలో తలపడలేక మనీని

Honey Trapping : విశాఖ నేవీలో హానీ ట్రాప్-మరో 12మంది నేవీ అధికారులు అరెస్ట్

Pp2

Updated On : March 25, 2022 / 11:16 AM IST

Honey Trap :  అయితే హనీ ట్రాప్‌ లేదంటే.. మనీ ట్రాప్‌.. నేరుగా ఎదుర్కోలేని పాకిస్థాన్‌.. మన నేవీపై కుట్ర పన్నింది. ఆయుధాలతో చేతగాక.. అమ్మాయిలను అడ్డు పెట్టుకుంటోంది. మరుభూమిలో తలపడలేక మనీని ఎరవేస్తోంది. అధికారులను ప్రలోభపరిచి దేశ రక్షణ రహస్యాలను దోచేస్తోంది.

ఇండియన్ నేవీపై పాకిస్తాన్ పన్నిన భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA ఛేదిస్తోంది. మనీ ట్రాప్‌లో భాగంగా మరికొందరు నేవీ అధికారులను అరెస్టు చేసింది. పాకిస్తాన్ పన్నిన వలలో చాలామంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పాక్ విష వలయాన్ని ఛేదించేందుకు NIA విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనీ ట్రాప్‌పై దర్యాప్తులో భాగంగా గతంలోనూ పలువురు నేవీ సిబ్బందిని అరెస్టు చేసిన NIA.. తాజాగా మరో 12మందిని అదుపులోకి తీసుకుంది.

2020 పాకిస్తానీ ఏజంట్ల గూఢచర్యం దర్యాప్తును కొనసాగిస్తున్న NIA అధికారులు… దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని బుల్దానాతోపాటు ఏపీలోని విశాఖలోనూ పలువురు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. కీలక సూత్రధారి యాకూబ్ గిటేలి, ముగ్గురు ఏజంట్లతోపాటు 12 మంది నేవీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ డివైజర్స్‌, సిమ్‌కార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

భారత నౌకాదళానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ ఏజంట్లు గూఢచర్యానికి పాల్పడ్డారు. యువ నేవీ అధికారులను ISI ఏజంట్లు మనీట్రాప్ చేశారు. నేవీ అధికారులతో ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని వాళ్ల కదలికలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నౌకలు, సబ్ మెరైన్లు, నేవీ ఉన్నతాధికారులకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు.

దీనిపై అనుమానం వచ్చిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ పేరుతో దర్యాప్తు చేపట్టారు. గూఢచర్యం బయటపడటంతో 12 మంది యువ నేవీ అధికారులను, ఐఎస్ఐ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరు నేవీ సెయిలర్స్‌ పాత్రకూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్న NIA బృందం… ఆ దిశగా దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.

భారత నేవీ సిబ్బందికి ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిల్ని ఎరగా వేస్తుంది ISI. తర్వాత వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్‌ వీడియోలు తీస్తుంది. అనంతరం ఐఎస్ఐ నేరుగా రంగంలోకి దిగి.. ఆ వీడియోలతో ట్రాప్‌లో చిక్కుకున్న వారిపై బెదిరింపులకు దిగుతుంది. ఇలా.. కీలకమైన నౌకాదళ సమాచారం సేకరిస్తోంది. దీనిపై భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌ పేరుతో రహస్య విచారణ జరిపింది.

విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం అంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. 1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర తూర్పు నౌకా దళానిది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి యేటా డిసెంబరులో సాగర తీరంలో నేవీ డే నిర్వహిస్తారు. పలు యుద్ధనౌకల విన్యాసాలతో విశాఖ తీరం పులకిస్తుంది.

సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూర కేంద్రంగా.. తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా.. విశాఖపట్నం కీలకంగా మారింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ని ఓడించి.. జాతి గర్వించదగ్గ గెలుపునందించింది విశాఖ. సముద్ర రక్షణలో శత్రువులను ప్రత్యక్షంగా సమర్థంగా ఎదుర్కోవడంలో వైజాగ్‌ గుర్తింపు తెచ్చుకుంది. కానీ పాకిస్థాన్‌ గూఢచార సంస్థ.. దొంగదెబ్బకు చిక్కి ఇప్పుడు చెడ్డపేరు తెచ్చుకుంటోంది.

రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్‌ పాలకుల హయాం నుంచే తూర్పు తీరం కీలకమైన ప్రాంతం. తూర్పు నౌకాదళం విశాఖపట్నం ప్రధాన స్థావరంగా ఏర్పాటైంది. మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహాసముద్రం వరకూ ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్‌బన్‌ నుంచి దక్షిణాన గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకూ విస్తరించి ఉంది.

Also Read : RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..
పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ విస్తరించి ఉంది. 2వేల 600 కిలోమీటర్ల నిడివి కలిగిన తూర్పు తీరంలో 13 మేజర్‌ పోర్టులున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. లుక్‌ ఈస్ట్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. డీఆర్‌డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. క్షిపణులు తయారు చేసే నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీస్‌ కూడా విశాఖలోనే ఏర్పాటైంది.

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో భారతీయ నౌకాదళం ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కిల్తాన్, ధ్రువ్‌ మొదలైన యుద్ధ నౌకల్ని సమకూర్చుకుంటూ దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మూడు సూపర్‌ ఫాస్ట్‌ హెలికాఫ్టర్లు చేరడంతో భద్రత వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది.

ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌-15బీ పేరుతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతోనే తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది.

ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖ శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇటీవల జరిగిన మిలాన్‌లో రాష్ట్రపతి జాతికి అంకితం చేశారు. ఇంతటి పేరున్న విశాఖ నేవీ ఇప్పుడు కొందరు సిబ్బంది వల్ల తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : Female Dog: కుక్కను ఉరివేసి చెట్టుకి వేలాడదీసిన దుండగులు

విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటుచేస్తున్నారు. మొదటి దశలో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో జలాంతర్గామి స్థావరం నిర్మించారు. రెండో దశ పనులకు మరో 3వేల 500 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించి వర్ష పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. విశాఖ కేంద్రంగానే అణుజలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరొకటి నిర్మాణంలో ఉంది. ఇలా దేశ రక్షణకు సంబంధించిన పలు కీలకమైన ప్రాజెక్టులు విశాఖలో రూపుదిద్దుకుంటుండగా.. పాకిస్థాన్‌ వీటి గుట్టుమట్లు తెలుసుకోవడానికి మనీట్రాప్‌, హనీట్రాప్‌కు పాల్పడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.