Sonia
Agnipath: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తోన్న యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. కరోనా అనంతర సమస్యలతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి ఆమె అగ్నిపథ్ ఆందోళనపై ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ ప్రకటనను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మిలిటరీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ఎటువంటి లక్ష్యమూ లేని విధంగా ఉందని ఆమె విమర్శించారు. ఉద్యోగార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించకుండానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆమె ఆరోపించారు. ఉద్యోగార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర సర్కారు ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పారు. యువత శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ఆమె సూచించారు.