Afghanistan : పంజ్‌షీర్‌లో ఇంటినుంచి ఈడ్చుకొచ్చి చంపుతున్న తాలిబన్లు
మళ్లీ అరాచకాలు చేయబోమని ప్రకటించిన తాలిబన్లు... వారి అసలు రూపాన్ని రెండు దశాబ్దాల తర్వాత మరోసారి చూపిస్తున్నారు.

Taliban Manhunt Afghanistan
Afghanistan : తమను ఎదిరించిన సింహాల గడ్డ పంజ్ షీర్ ఏరియాలో నరమేధం కొనసాగిస్తున్నారు తాలిబన్లు. పాకిస్థాన్ సైన్యం సాయంతో… పంజ్ షీర్ ను అతి కష్టమ్మీద వశం చేసుకున్న తాలిబన్లు… పంజ్ షీర్ లోయలో తమ ఉగ్ర ప్రతాపం చూపిస్తున్నారు. ఇంటింటా తనిఖీలు చేసి… మారణ హోమం సృష్టిస్తున్నారు.
ఇంటి నుంచి ఈడ్చుకొచ్చి..
తమకు అఫ్ఘానిస్తాన్ లో ఎదురేలేకుండా చేసుకుంటున్నారు తాలిబన్లు. రెసిస్టెన్స్ ఫోర్స్ ఆనవాళ్లు లేకుండా చేసుకుంటున్నారు. వారికి మద్దతిచ్చిన వాళ్లను కూడా వదలడం లేదు. పంజ్ షీర్ ఏరియా మొత్తాన్నీ జల్లెడ పడుతున్న తాలిబన్లు.. ఇంటింటా ఉన్న యువకులను టార్గెట్ చేస్తున్నారు. ఇంటినుంచి బయటకు ఈడ్చుకొచ్చి మరీ చంపేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తిరుగుబాటు నేత అహ్మద్ మసూద్ ఆర్మ్స్ డిపోను తాలిబన్లు ఇప్పటికే ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది.
ప్రశ్నిస్తే చిత్రహింసలు
స్థానికుల సహాయంతోనే పంజ్ షీర్ లో రెసిస్టెన్స్ ఫోర్స్ తమపై ప్రతిఘటన చేసిందని తాలిబన్లు నమ్ముతున్నారు. పంజ్ షీర్ ఫోర్స్ చేసిన ఎదురుదాడిలో వందలాది మంది తాలిబన్లు చనిపోయారు కూడా. దీంతో.. ప్రతీకారం తీర్చుకుంటున్నారు తాలిబన్లు. లోయను తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్లు… ప్రశ్నించిన వారిని చిత్రహింసలు పెడుతున్నారు. ఆఖరుకు మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేదు. స్థానికుల వాయిస్ ను వినిపించే స్వేచ్ఛ లేకుండా ఆంక్షలు పెట్టారు.
రెండు దశాబ్దాల మారణ కాండ
1998లో అప్ఘానిస్తాన్ లోని మజారే షెరీఫ్ ప్రాంతంలోనూ ఇలాగే మారణ హోమం సృష్టించారు తాలిబన్లు. వీధులన్నీ తిరుగుతూ కనిపించినవారిని తుపాకులతో కాల్చివేశారు. మహిళలు, చిన్నపిల్లలు.. ఆఖరుకు పశువులు, జంతువులని కూడా చూడలేదు. మైనారిటీలైన హజారాల ఇంటింటికి వెళ్లి.. వారి కుటుంబసభ్యుల ముందే ఇంటిపెద్దల గొంతు కోసి చంపేశారు. మళ్లీ అరాచకాలు చేయబోమని ప్రకటించిన తాలిబన్లు… వారి అసలు రూపాన్ని రెండు దశాబ్దాల తర్వాత మరోసారి చూపిస్తున్నారు.
Taliban Rule: తాలిబాన్ల కొత్త రూల్ – అనుమతి లేకుండా ఆందోళనలు వద్దు