Anandavan : రాళ్ళు, రప్పలతో నిండిన స్ధలాన్ని అడవిగా మార్చేశారు..!

ఆనంద్ వనమిత్రమండలి సభ్యులు అటవీశాఖ అధికారులను కలసి తమ ఆలోచనను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఆ స్ధలం చుట్టూ ఫెన్సింగ్ అటవీ అధికారులు ఏర్పాటు చేశారు.

Anandavan : రాళ్ళు, రప్పలతో నిండిన స్ధలాన్ని అడవిగా మార్చేశారు..!

Anandavan (2)

Updated On : August 10, 2021 / 1:10 PM IST

Anandavan : ఇటీవలి కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవంతో వాతవరణం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పరిస్ధితుల నుండి మనం బయటపడాలంటే మొక్కలను విస్తారంగా పెంచటం ఒక్కటే మార్గం. మన ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం ఉంటే దానిలో చెత్త చెదారంతో  నింపేస్తుంటాం. కనీసం అందులో నాలుగైదు మొక్కులు నాటుదామన్న ఆలోచన ఎవరికి కలుగదు. అయితే పూనేలోని కొంతమంది పర్యావరణ ప్రేమికులు చేపట్టిన చిన్నప్రయత్నం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. వృధాగా పడి ఉన్న 33 ఎకరాల స్ధలాన్ని వారు మిని ఫారెస్ట్ గా మార్చిన వైనం ఆదర్శనీయమనే చెప్పాలి.. దానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే….

దక్షిణ పూనే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్ మెంట్ ఏరియాలో 33 ఎకరాల ఖాళీ స్ధలం ఎందుకు పనికి రాకుండా వృధాగా పడివుంది. 2013 ముందు వరకు ఈ స్ధలంలో రాత్రి సమయంలో తాగుబోతులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. చెత్తా చెదారం అక్కడే పోగుబడి, పిచ్చి మొక్కలతో దర్శనమిచ్చేది. అయితే ఎలైగానా ఈ వృధాగా పడివున్న స్ధలాన్ని చిన్నపాటి అడవిలా మార్చాలని నిర్ణయించుకున్నారు ఆనంద్ వన మిత్రమండలి సభ్యులు.

అనుకున్నదే తడవుగా సభ్యులు రంగంలోకి దిగారు. స్ధానికుల సహకారం పొందేందుకు వీరు పడిన కష్టం అంతా ఇంతాకాదు. సమీపంలోని నివాశితులందరిని కలిశారు. తమ అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. వారి సహకారాన్ని అందించాలని కోరారు. ఖాళీ స్ధలంలో చెత్త వేయకుండా, ఇతర కార్యకలాపాలకు వినియోగించకుండా చూసే బాధ్యతలో వారిని కూడా భాగస్వాములను చేశారు. ఈ ప్రాంతమంతా పచ్చని అడవిలా మారితే ఎంతో అహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోతుందని భవిష్యత్తు చిత్రాలను వారి కళ్ళముందు సాక్షత్కరింపచేశారు.

పనిలోపనిగా ఆనంద్ వనమిత్రమండలి సభ్యులు అటవీశాఖ అధికారులను కలసి తమ ఆలోచనను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఆ స్ధలం చుట్టూ ఫెన్సింగ్ అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో బయటి వ్యక్తులు లోపలకు రాకుండా నిలువరించేందుకు అవకాశం ఏర్పడింది. స్ధానికుల సహాకరం తీసుకుని చిన్నగా మొక్కలు నాటటం ప్రారంభించారు. స్ధానికులతోపాటు, వాటర్ ట్యాంకర్ల సహాయంతో మొక్కలకు నీటిని అందించేవారు.

ప్రస్తుతం ఈ ప్రాంతమంతా చిన్నపాటి అడవిగా మారిపోయింది. ప్రశాంత మైన వాతావరణతో పాటు పక్షుల కిలకిలా రావాలు పరిసర ప్రాంతవాసులకు అహ్లాదాన్ని పంచుతున్నాయి. దీనికి ఆనందవన్ గా పేరు పెట్టారు. మొత్తం 90 రకాల చెట్లు ఈ మినీ ఫారెస్ట్ లో దర్శనమిస్తుంటాయి. నగరంలో మధ్యలో ఉన్న 33 ఎకరాల అడవి అందరిని ఆకట్టుకుంటుంది. ఎనిమిదేళ్ళ కాలంలో ఆనంద్ మిత్రమండలి పడినకష్టం ప్రస్తుతం నగర వాతావరణాన్నికొంత మేర మార్చేందుకు దోహదపడిందని చెప్పవచ్చు.