భారత్ లో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైంది…మరిన్ని కఠిన సంస్కరణలు అవసరం : నీతి ఆయోగ్ సీఈవో

NITI Aayog CEO Amitabh Kant భారత్ లో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయిందని, అందుకే సంస్కరణలు చేపట్టడం చాలా కష్టంగా మారుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మరిన్ని సంస్కరణలు అవసరమని తెలిపారు.
మంగళవారం(డిసెంబర్-8,2020) స్వరాజ్య మ్యాగజైన్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ కాంత్ మాట్లాడుతూ…తొలిసారిగా మైనింగ్, బొగ్గు, కార్మిక, వ్యవసాయ రంగాల్లో కొన్ని కఠినమైన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక తర్వాత సంస్కరణల దశ రాష్ట్రాల నుంచే రావాలి. భారతదేశంలో కఠినమైన సంస్కరణలు తీసుకురావడం చాలా కష్టం. మనకు ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయింది.
ఇలాంటి సంస్కరణలు(మైనింగ్,బొగ్గు,కార్మిక,వ్యవసాయ) చేపట్టాలంటే దృఢమైన రాజకీయ సంకల్పం ఉండాలి. అదేవిధంగా, భవిష్యత్ లో మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉందని అమితాబ్ కాంత్ అన్నారు. కఠినమైన సంస్కరణలు లేకుండా చైనాతో పోటీ పడటం అంత సులభం కాదని ఆయన తెలిపారు. కఠినమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వానికి బలమైన రాజకీయ సంకల్పం కలిగి ఉందన్నారు.
ఒకవేళ 10-12 రాష్ట్రాలు అధిక వృద్ధి రేటుతో పరుగులు తీస్తే.. దేశ వృద్ధి రేటు కూడా పరుగులు పెడుతుందని అమితాబ్ కాంత్ తెలిపారు. డిస్కమ్ లను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర పాలిత ప్రాంతాలను అడిగామని ఈ సందర్భంగా అమితాబ్ కాంత్ తెలిపారు.
ఇక,వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తోన్న ఆందోళనపై స్పందిస్తూ.. వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు అవసరమని చెప్పారు. కనీస మద్దతు ధర(MSP), మండీ లేదా మార్కెట్లు ఉంటాయన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం చాలా ఉందని, దీని వల్ల రైతులకు కచ్చితంగా మేలు జరుగుతుందని అమితాబ్ కాంత్ తెలిపారు. తమ పంట లేదా ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులకు ఛాయిస్ తప్పనిసరిగా ఉండాలన్నారు.