Heart Beat Faster : కొన్ని సందర్భాల్లో మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? మనం చేసే తప్పులే దీనికి కారణమా?
గుండె నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం సరఫరా అయ్యేందుకు ఒక రకమైన ఎలక్ట్రికల్ ఇంపల్స్ సహాయ పడుతుంది. వీటిద్వారా వచ్చే విద్యుత్ ప్రవాహంలో ఏవైనా తేడాలు వస్తే అప్పుడు గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది.

Heart Beat Faster
Heart Beat Faster : గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఎక్కువ కాలం జీవించగలడు. మానవ జీవిత కాలాన్ని గుండె నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన గుండె పనితీరుకు తప్పనిసరిగా మీ డైలీ మెనూలో పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను సరైన మొత్తంలో తీసుకోవాలి. గుండె ఆరోగ్యం కొవ్వు లేని ఆహారం తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. గుండెని సురక్షితంగా ఉంచగలిగే కొన్ని పోషకాలు, ఖనిజాలు మన రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సిరలు, ధమనులలో సరైన రక్త ప్రసరణకు కూడా ఇవి సహాయపడతాయి.
ప్రధానంగా జీవనశైలి, ఆహారం గుండెకు ముప్పుగా మారుతున్నాయి. వయసు రీత్యా కొన్ని కండరాలు బలహీనపడడం గుండెకు చేటుకలిగిస్తాయి. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే, కొంత కాలానికి గుండె కండరాలు మరింత బలహీనపడిపోతాయి. దాంతో సాధారణ పనితీరు చూపించలేదు. అప్పుడు గుండె బబ్బులు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ తదితర తీవ్ర సమస్యలు కనిపిస్తాయి. సాధారణంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులకు అయితే ఇలా జరుగుతుంది. ఇక గుండె కొట్టుకునే వేగం మనిషి మనిషికి మారుతుంది. ఈ వేగం నిమిషానికి 60 నుంచి 100 వరకు ఉంటుంది. కానీ కొందరికి ఎల్లప్పుడూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకుంటుంంది. అయితే ఇది అనారోగ్య సమస్యలకు సూచన. ఇలా మీ గుండె గనక నిమిషానికి 100 సార్ల కన్నా ఎక్కువగా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా అంటారు.
గుండె నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం సరఫరా అయ్యేందుకు ఒక రకమైన ఎలక్ట్రికల్ ఇంపల్స్ సహాయ పడుతుంది. వీటిద్వారా వచ్చే విద్యుత్ ప్రవాహంలో ఏవైనా తేడాలు వస్తే అప్పుడు గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. రక్తహీనత, బీపీ తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, జ్వరం, డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, మద్యం తాగడం, ధూమపానం, డ్రగ్స్ వాడడం, టీ, కాఫీలు అధికంగా తాగడం ఇలాంటి కారణాల వల్ల కూడా గుండె వేగం పెరిగిపోతుంది. మనం మన జీవన విధానంలో చేసే తప్పులే మన గుండె వేగంగా కొట్టుకోవడానికి కారణమవుతున్నాయి. మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. ఈ అలవాట్లు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఛాతీలో నొప్పిగా అనిపించినా, తల తిరగడం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటివి తరచచూ అనిపిస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి హార్ట్ ఎటాక్ కు సంబంధించిన లక్షణాలు. గుండె కొట్టుకునే వేగం పెరిగినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. టాకీకార్డియా వచ్చిన వారిలో రక్తహీనత కనిపిస్తుంది. అలాగే శరీరంలో పలు భాగాల్లో ఒక్కోసారి తీవ్ర రక్త స్రావం అవుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స పొందాలి. గుండె వేగంగా కొట్టుకున్నట్లు లేదా గుండె చప్పుడుతో బాధపడుతున్నట్లు మీకు అనిపిస్తే కచ్చితంగా కార్డియాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స పొందాలి.