Protein Food : ఎదుగుతున్న పిల్లలకు ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలంటే!..
మాంసం, చేపలూ, సోయా బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి కాంప్లెక్స్ అందుతుంది. గుడ్లలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అల్పాహారంగా

Food
Protein Food : ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అవసరం. ఎదుగుతున్న పిల్లలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం అందించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ కనబరచటంలేదు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. పిల్లలు తల్లిదండ్రులు సూచించిన ఆహారాన్ని తినకుండా మారాం చేయటం ఒక కారణంకాగా, మరికొందరు పిల్లలు చిరుతిండి బాగా తింటారు. ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు అన్నీ ఉన్నాయా, లేదా అని చూసుకుని ఆహారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.
పౌష్టికాహారం తీసుకునే పిల్లలు శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదగడమే కాదు, చదువుల్లో, ఇతర అంశాల్లోనూ రాణిస్తారు. అలాగని ఏది పడితే అది తినిపించడమూ మంచిది కాదు. ముఖ్యంగా వాళ్లు ఇష్టంగా తింటున్నారు కదా అని జంక్ ఫుడ్ తినిపిస్తే ఆరోగ్యంగా ఎదగకపోగా ఊబకాయం వస్తుంది. ముందు ముందు అది మరెన్నో సమస్యలకు దారి తీయవచ్చు. అందువల్ల ఏ ఆహారంలో పిల్లలకు ఇస్తే ఎలాంటి గ్రోత్ వారిలో ఉంటుందో ముందుగా తెలుసుకోవాలి. తద్వారా పిల్లల ఎదుగుదలకు అవసరమైన వాటిని అందించటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఎదుగుతున్న పిల్లలకు పాలు చాలా శ్రేష్టమైనవి. పుట్టిన పిల్లలకు తల్లి పాలు తాగించటం మంచిది. వ్యాధి నిరోధక శక్తిని కలిగి త్వరగా జీర్ణం అయ్యే ఆహారంగా తల్లిపాలను చెప్పవచ్చు. ప్రోటీనులూ, విటమిన్లు, ఖనిజాలు గల పాలు ఆవుపాలు పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆవుపాలు తాగటం వల్ల చిన్నవయస్సులో వచ్చే శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించడంతోపాటు ఎంతో మేలు చేస్తాయి.
ఎముకల బలానికి, కంటి చూపు మెరుగుపడటానికి మానసిక , శారీరక ఎదుగుదలకి చిన్నారులకు విటమిన్ ఎ కలిగిన ఆహారాన్ని అందించటం అవసరం. ఇందుకు గాను జున్ను, పాలు, క్యారెట్, గుడ్లు వంటి ఆహారం అందించాలి. శరీరంలో రక్తం బాగా వృద్ధిచెందటానికి, ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవటానికి పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ ను ఇస్తే మంచిది. శరీర దృఢత్వం కోసం , మృధువైన చర్మం కోసం టొమాటో, తాజా కూరలు, పుల్లని పండ్లు అందించటం వల్ల వారికి సి విటమిన్ లభిస్తుంది.
మాంసం, చేపలూ, సోయా బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి కాంప్లెక్స్ అందుతుంది. గుడ్లలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అల్పాహారంగా గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్ స్థాయులు మెరుగుపడతాయి. పెసర్లు, శనగలు, రాగులు, బొబ్బర్లు, పల్లీలు, ఖర్జూరాలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని 12 గంటల పాటు నీటిలో నానబెట్టి మరో 12 గంటల పాటు తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. దీంతో మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజూ పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్థాలు మిక్కిలిగా లభిస్తాయి.
కార్బోహైడ్రేట్లు పిల్లలకు శక్తిని ఇవ్వటానికి ఎంతో అవసరం. పిండి పదార్థాలు పిల్లలకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్ధిగా లభిస్తాయి. దీంతో పిల్లలు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని నిత్యం ఎదిగే పిల్లలకు అందించటం చాలా ముఖ్యం. లేదంటే వారిలో అలసట, చదువుల్లో వెనుకబడడం, జ్ఞాపక శక్తి తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఎప్పుడూ వ్యాధుల బారిన పడడం, దృష్టి లోపాలు రావడం, ఎముకలు బలహీనంగా మారంటం, దంతాలు, చిన్నపాటి బరువులను కూడా మోయలేకపోవడం, చురుగ్గా ఉండకపోవడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తాయి.