వరల్డ్ వార్ ఎపిక్ డ్రామా ‘1917’ కు ముచ్చటగా మూడు ఆస్కార్ అవార్డులు

92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో ‘1917’ సినిమా మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది..

  • Publish Date - February 10, 2020 / 06:04 AM IST

92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో ‘1917’ సినిమా మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది..

ప్రతిభకు పట్టం.. ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డుల ప్రధానం.. ప్రపంచ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యుత్తమ అకాడెమీ ‘ఆస్కార్’ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. 92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో ‘పారాసైట్‌’ చిత్రంతో పాటు ‘జోకర్‌’, ‘1917’ చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. ‘జోకర్‌’ చిత్రానికి గాను హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా..‘1917’ సినిమా మూడు విభాగాల్లో (విజువల్‌ ఎఫెక్ట్‌, సౌండ్‌ మిక్సింగ్‌, సినిమాటోగ్రఫీ) అవార్డులను సొంతం చేసుకుంది. 92వ అకాడమీ అవార్డులకు ఈ సినిమా 10 నామినేషన్లు పొందడం విశేషం.  

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంబ్లిన్ పార్టనర్ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో   నిర్మించిన ‘1917’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైంది. సామ్ మెండెస్ (స్కై ఫాల్) ఫేమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వార్ ఎపిక్ డ్రామా ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకుంది. అలాగే బఫ్టా అవార్డ్స్‌కు ఈ సంవత్సరం 9 నామినేషన్లు పొందింది. అలాగే 77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘1917’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. దర్శకుడు సామ్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు.

 

ఏకంగా ఏడు బాఫ్టా అవార్డ్స్ అవార్డులు గెలుచుకుని సత్తా చాటిందీ చిత్రం..  ఇటీవల లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన బ్రిటిష్ అకాడీమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ పురస్కారాల ప్రధానోత్సవంలో.. ‘1917’ మూవీకి ‘బెస్ట్ ఫిల్మ్’, ‘అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్’, ‘డైరెక్టర్’, ‘సినిమాటోగ్రఫీ’, ‘ప్రొడక్షన్ డిజైనింగ్’, ‘సౌండ్’, ‘స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్’.. కేటగిరీల్లో అవార్డులు లభించాయి.