మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు. కలాం లాంటి వ్యక్తి సినిమా తీయడం సంతోషమని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ప్రజల మనసు గెలుచుకున్న గొప్ప వ్యక్తి, చివరి వరకు అబ్దల్ కలాం సామాన్యుడిలా జీవించారని అంటూ కొనియాడారు. భారతదేశానికి శాటిలైట్ సేవలు అందించిన ఘనత కలాందేనన్నారు.
ఇక దీనిపై ఆలీ మాట్లాడుతూ..అబ్దుల్ కలాంకు తాను 40 ఏళ్లుగా పెద్ద అభిమానినని, గొప్ప వ్యక్తి బయోపిక్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు జగదీష్ దానేటీ, నిర్మాత జాన్ మార్టిన్ నేతృత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టాలీవుడ్, హాలీవుడ్ కలయికతో సినిమాను నిర్మించనున్నారు. కలాం పాత్రకు తాను సూట్ అవుతానని చిత్ర నిర్మాతలు భావించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సుమారు రెండు గంటల పాటు సినిమా ఉంటుందని, మార్చిలో షూటింగ్ ప్రారంభమై…అక్టోబర్ నెలలో చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించారు.