Abhignya Vuthaluru Viraatapalem PC Meena Reporting Zee5 Web Series Review
Viraatapalem – PC Meena Reporting Web Series Review : అభిజ్ఞా వూతలూరు మెయిన్ లీడ్ లో నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పై KV శ్రీరామ్ నిర్మాణంలో కృష్ణ పోలూరు దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ నేడు జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. 1980లో విరాటపాలెం అనే ఊళ్ళో ఒక పెళ్లి జరగ్గానే పీటల మీదే పెళ్లికూతురు చనిపోతుంది. ఆ తర్వాత అలాగే కొంతమంది పెళ్లి జరగ్గానే చనిపోతూ ఉంటారు. దీంతో ఆ ఊరి వాళ్లంతా వేరే ఊళ్లకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. అలా వెళ్లిపోయిన వాళ్ళందరి ఆస్తులను తక్కువ ధరకు నరసయ్య కొనేస్తూ ఉంటాడు. ఓ పదేళ్ల తర్వాత ఆ ఊరికి మీనా(అభిజ్ఞ) అనే పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది. శాపం వల్లే ఈ ఊరికి ఇలా జరుగుతుంది అని ఈ పెళ్లి కథలు విని ఆశ్చర్యపోతుంది. అప్పుడే రంగ అనే వ్యక్తి తాగినమత్తులో, ఆ ఊరి మీద ప్రేమతో సడెన్ గా ఓ వేశ్యని పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి చేసుకోగానే కాకుండా నెక్స్ట్ డే ఆ వేశ్య చనిపోతుంది. దీంతో మీనాకు ఇవన్నీ హత్యలు అని అనుమానమొస్తుంది.
వేశ్య బ్లడ్ శాంపిల్స్ సిటీకి టెస్టింగ్ కోసం పంపించి ఈ పెళ్లికూతుళ్ళు చనిపోయే వెనక ఏముందో తెలుసుకోవాలని తానే ఆ ఊరి ప్రసిడెంట్(రామరాజు) కొడుకుని పెళ్లి చేసుకోడానికి ఫిక్స్ అవుతుంది. పెళ్ళిలో చావుదాకా వెళ్లొచ్చి బయటపడుతుంది. తనని చంపడానికి ప్లాన్ చేసింది ప్రసిడెంట్ కూతురు(లావణ్య) అని అనుమానిస్తోంది. దీంతో ఆ కేసుని ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేసి పెళ్లికూతుళ్ళను చంపుతుంది ఎవరో కనిపెట్టే పని మొదలుపెడుతుంది. ఈ క్రమంలో నరసయ్య తనకు ట్రాన్స్ఫర్ చేయించాడని తెలిసి నరసయ్యని ఒక విషయంలో అరెస్ట్ చేస్తుంది. అసలు ఈ హత్యలు అన్ని ఎవరు చేస్తున్నారు? పెళ్లి కూతుళ్ళని ఎందుకు చంపుతున్నారు? నరసయ్య ఎందుకు మీనాని ట్రాన్స్ఫర్ చేయించాలనుకుంటాడు? వేశ్య పెళ్లి అయిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే ఎందుకు చనిపోతుంది? మీనా టీ షాప్ కిట్టుతో కలిసి ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తుంది? మీనా పెళ్లి జరుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : 3 BHK : సిద్దార్థ్ కొత్త సినిమా.. 3BHK ట్రైలర్ వచ్చేసింది.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల..
సిరీస్ విశ్లేషణ.. ఇటీవల థ్రిల్లింగ్ సిరీస్ లు అంటే ఆసక్తిగానే ఉంటున్నాయి. అందులోను పీరియాడిక్ సెటప్ అయితే బానే ఉంటున్నాయి. పెళ్లి రోజే పెళ్లి కూతుళ్లు చనిపోవడం అనే కాన్సెప్ట్ తో ట్రైలర్ చూపించి సిరీస్ పై అంచనాలు బానే పెంచారు. మొదటి రెండు ఎపిసోడ్స్ నీరసంగానే సాగుతాయి. మూడో ఎపిసోడ్ లో మీనా పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిన దగ్గర్నుంచి కాస్త ఆసక్తి నెలకొంటుంది. ఇక వెబ్ సిరీస్ లు అంటే స్లో నేరేషన్ అని తెలిసిందే. కానీ ఇది మరీ స్లో నేరేషన్ లో ఉండటంతో ఫార్వార్డ్ చేసుకుంటూ చూడాలనిపిస్తుంది. హంతకుడు అతనా, ఇతనా, వాళ్ళా, వీళ్లా.. అని పలువురి మీద అనుమానాలు రేకెత్తించించడంలో బాగానే సక్సెస్ అయ్యారు.
అసలు చివరిదాకా ఈ మర్డర్స్ చేసేది ఎవరో మనం ఊహించలేం. ఎందుకు చేస్తున్నారు అని కారణం కనుక్కోలేం. అది సిరీస్ కి బాగా ప్లస్ అయ్యాయి. కానీ దేనివల్ల అని మీనా పెళ్లి సమయానికి మనం గెస్ చేసేయొచ్చు. అయితే నాలుగో ఎపిసోడ్ నుంచి ఎవరు మర్డర్స్ చేస్తున్నారు అని కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో మొత్తం ఒకేసారి రివీల్ చేయడం, అన్ని అనుమానాలు తొలగించడంతో ఏదో హడావిడిగా క్లైమాక్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో చాలా చిన్న లాజిక్ వదిలేసారు. దీంతో ఇదెలా సాధ్యం అనే సందేహం రాకమానదు. మొదటి పెళ్లికూతురు మరణం హత్య లేకా సూసైడా అనే క్లారిటీ ఇవ్వలేదు. మీనా చావకుండా బతకడానికి ఏదో నాటుమందు వాడాలి అని ఎలా తెలిసింది అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద సిరీస్ లో కొన్ని క్లారిటీలు, లాజిక్స్ వదిలేసారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. యూట్యూబ్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న అభిజ్ఞ సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇన్నాళ్లు నటించగా మొదటిసారి మెయిన్ లీడ్ లో మెప్పించింది. ధైర్యం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో బాగానే నటించింది. చరణ్ లక్కరాజు కిట్టు పాత్రలో ఓకే అనిపిస్తాడు. ప్రసిడెంట్ కూతురిగా పెళ్లి కోసం ఎదురుచూసే అమ్మాయి పాత్రలో లావణ్య బాగా నటించింది. రామరాజు, గౌతమ్ రాజు.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రలో పర్వాలేదనిపిస్తారు.
Also Read : Maargan : ‘మార్గన్’ మూవీ రివ్యూ.. విజయ్ యాంటోని మరో థ్రిల్లర్ సినిమా..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడినా ఒక చోట చిన్న ఊరు సెట్ వేసి తీశారు అని తెలిసిపోతుంది. అన్ని సీన్స్ అక్కడక్కడే చూపించేసారు అనే ఫీల్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. పెళ్లికూతుళ్ళు చనిపోవడం అనే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ ఇంకా చాలా పని చేయాలి. చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేసి ల్యాగ్ తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ పరంగా మాత్రం కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘విరాటపాలెం – PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ పెళ్లి కూతుళ్లు చనిపోతున్న ఊరికి వచ్చిన ఓ లేడీ కానిస్టేబుల్ ఎందుకు చనిపోతున్నారు అని ఎలా కనిపెట్టింది అంటూ నిదానంగా సాగిన సస్పెన్స్ థ్రిల్లర్.
https://www.youtube.com/watch?v=F50uSc581vo
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.