భానుప్రియ కేసులో ట్విస్ట్ : దొంగతనం చేశాను అంటున్న బాలిక

  • Publish Date - January 24, 2019 / 02:59 PM IST

చెన్నై : తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకేత్తించింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంట్లో పని కోసం 14 ఏళ్ల తమ కూతురు సంధ్యని భానుప్రియ తీసుకెళ్లిందని.. ఏడాది కాలంగా మాట్లాడనీయటం లేదని తల్లి ప్రభావతి ఆరోపించింది.

దీనిపై భానుప్రియ స్పందించారు. ఇంట్లో దొంగిలించిన వస్తువులు తిరిగి అడిగినందుకే కేసు పెట్టారని తెలిపారు. ఏడాది నుంచి బాలిక పద్మ పనిచేస్తోందని.. డబ్బు, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో పద్మను నిలదీయడం జరిగిందని వెల్లడించారు. పోలీసులకు చెబుతామని హెచ్చరించడం కూడా జరిగిందన్నారు. చివరకు బాలిక తన తప్పును ఒప్పుకుందని చెప్పిన భానుప్రియ…తల్లిని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి తీసుకొచ్చిందని భానుప్రియ చెప్పారు. మిగిలిన వస్తువులను తీసుకొస్తామని ఇంటికి వెళ్లిన బాలిక తల్లి చివరికి తమ పైనే కేసు పెట్టిందని చెప్పారు. 

బాలిక కూడా మీడియాతో మాట్లాడింది. భానుప్రియ ఇంట్లో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. డబ్బు, నగలు దొంగిలించిన తానే తన తల్లికి ఇచ్చినట్లు వెల్లడించింది. మరి..ఈ కేసు ఇంకా ఎలాంటి టర్న్‌లు తీసుకుంటుందో ? ఎండ్ కార్డు ఎలా పడుతుందో చూడాలి.