Niti Taylor Wedding: బుల్లితెర ద్వారా నటిగా పరిచయమైన నీతి టేలర్ తనీష్ హీరోగా నటించిన ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. రాహుల్ రవీంద్రన్ పక్కన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలోనూ నటించింది. నటిగా పర్వాలేదనిపించినా అవకాశాలు రాకపోవడంతో ఆమె కెరీర్ అనుకున్నంత ఆశాజనకంగా సాగలేదు. దీంతో ఆమె నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కట్ చేస్తే చాలా కాలం తర్వాత తనకు పెళ్లైపోయిందంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆగష్టులో తన చిరకాల స్నేహితుడు పరిక్షిత్ భవను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని తెలిపింది.
‘మిస్ నుంచి మిసెస్‌గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే వారందరికి చెప్పాలనుకుంటున్నాను.. ఆగష్టు 13, 2020న పరిక్షిత్‌ను వివాహం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇప్పడు నేను గట్టిగా చెప్పగలను ‘హలో హస్బండ్’.. అంటూ నీతి కామెంట్ చేసింది. అంతేగాక తన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ఆలస్యంగా వెల్లడించాల్సి వచ్చిందో కారణం కూడా తెలియజేసింది.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న సందర్భంగా వివాహా విషయాన్ని దాచిపెట్టినట్లు పేర్కొంది. కరోనా పూర్తిగా అంతరించిన అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సినీ పరిశ్రమ వారు నీతి టేలర్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..