Bandi : ‘బందీ’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆదిత్య ఓం హీరోగా మొదటి సినిమా ఎలా ఉంది?

బందీ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్.

Aditya Om Bandi Movie Review and Rating Here

Bandi Movie Review : ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన ఆదిత్య ఓం మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇటీవల బిగ్ బాస్ లో కనపడి మెప్పించిన ఆదిత్య ఓం ఇప్పుడు మళ్ళీ హీరోగా ‘బందీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆదిత్య ఓం ఒక్క పాత్రతోనే గల్లీ సినిమా బ్యానర్ పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మాణంలో తిరుమల రఘు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బందీ సినిమా నేడు ఫిబ్రవరి 28న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కేవలం ఒక్క పాత్రతోనే నడుస్తుంది. మిగిలిన పాత్రలు కేవలం వాయిస్ లు వినిపిస్తాయి. ఆదిత్య వర్మ(ఆదిత్య ఓం)ఓ పెద్ద కార్పొరేట్ లాయర్. కొంతమంది ఓ అడవిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆదిత్య వర్మ వాళ్లకు సపోర్ట్ గా, అడివికి వ్యతిరేకంగా కేసు నడిపిస్తాడు. దీంతో ఆదిత్య వర్మ గర్ల్ ఫ్రెండ్, అడవులను కాపాడే కొంతమంది కలిసి ఆదిత్య వర్మని భయపెట్టినా ఈ కేసు క్యాన్సిల్ అవ్వడానికి నో చెప్తాడు.

దీంతో అతన్ని కిడ్నాప్ చేసి అదే అడవిలో వదిలేస్తారు. ఎవరూ లేని అడవిలో ఒక వారం రోజుల పాటు ఆదిత్య వర్మ భయపడుతూ జీవనం సాగిస్తాడు. ఓ డ్రోన్ తో ఆదిత్యని కాంటాక్ట్ అయి అతనికి ఒక టాస్క్ ఇస్తారు. అది చేస్తే వదిలిపెడతాం అంటారు. మరి ఆ టాస్క్ ఆదిత్య వర్మ పూర్తి చేశాడా? అసలు ఆ టాస్క్ ఏంటి? అడవికి సపోర్ట్ గా ఆదిత్య వర్మ సంతకం చేశాడా? డబ్బు కోసం బతికే ఆదిత్య మారాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Aghathiyaa : ‘అగత్యా’ మూవీ రివ్యూ.. భయపెడుతూనే ఆసక్తికర అంశాలు చూపించారుగా..

సినిమా విశ్లేషణ.. బందీ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఒకే పాత్రతో గంటన్నర సేపు నడిచిన సినిమా. మనిషి డబ్బుకి అలవాటు పడి, ప్రకృతిని నాశనం చేస్తూ ప్రేమానురాగాలు మర్చిపోతూ బతుకుతుంటాడు. అలా బతికే ఓ వ్యక్తికి ప్రకృతి విలువను ఎలా తెలియచేసారు అనేదే ఈ సినిమా కథాంశం.

హీరో పాత్ర పరిచయం చేసి అతన్ని భయపెట్టడం, తర్వాత అడవిలో వదిలేయడం, అడవిలో అతను ఎలా ఉన్నాడు అని ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ టాస్క్ ఇవ్వడంతో ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ కష్టమయిన ఆ టాస్క్ ని ఎలా చేసాడు అని ఉత్కంఠంగా సాగుతుంది. సినిమా అంతా ఒకటే పాత్ర కాబట్టి కాస్త బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ మాత్రం ఉత్కంఠంగా, ఆసక్తిగా సాగుతుంది. సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన డైలాగ్స్ ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండేది. ఆ వాయిస్ కూడా ఎవరైనా తెలిసిన నటుడితో ఇప్పిస్తే ఇంకాస్త బాగుండేది అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో ఒక్కడే నటుడు ఆదిత్య ఓం. చాన్నాళ్ల తర్వాత మంచి ఆదిత్యకు మంచి స్కోప్ ఉన్న పాత్ర వచ్చింది. ఓ వైపు డబ్బున్న వాడిగా, మరోవైపు అడవిలో చిక్కుకొని ప్రాణభయంతో బాగా నటించాడు. ఈ పాత్ర కోసం ఆదిత్య అడవిలో బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది.

Also Read : Guard : ‘గార్డ్’మూవీ రివ్యూ.. ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్ ఏం చేసాడు?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒక్క పాత్రే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాటిక్ షాట్స్ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మంచి థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఒక మనిషిని మార్చడం అనే మాములు కథని ఒక్క పాత్రతో సర్వైవల్ థ్రిల్లర్ గా బాగా రాసుకున్నారు. ఈ కథ, డైలాగ్స్ ఆదిత్య ఓం రాయడం గమనార్హం. దర్శకుడు కూడా బాగానే తెరకెక్కించాడు. సినిమా అంతా ఓ అడవి, ఓ రూమ్ లోనే రెండు లొకేషన్స్ లో ఉంటుంది. మంచి అడివినే పట్టుకున్నారు. సినిమాని తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘బందీ’ సినిమా ఓ అడవిని కాపాడటానికి, డబ్బుకి బానిస అయిన ఓ వ్యక్తిని అదే అడవిలో వదిలేసి ఎలా మార్చారు అని సర్వైవల్ థ్రిల్లర్ గా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.