ప్రముఖుల మరణం.. బాలీవుడ్ దిగ్భ్రాంతి..

  • Publish Date - October 6, 2020 / 09:00 PM IST

Anil Devgan – Vishal Anand Passes away: ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అజయ్ దేవ్‌గన్ తమ్ముడు అనిల్ దేవ్‌గన్(51) క్యాన్సర్‌తో పోరాడుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ‘రాజూ చాచా’, ‘బ్లాక్‌మెయిల్’ సినిమాలకు అనిల్ దర్శకత్వం వహించారు. అలాగే అజయ్ దేవ్‌గన్ ‘సన్నాఫ్ సర్దార్’ సినిమాకు అనిల్ దేవ్‌గన్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

అనిల్ దేవ్‌గన్ మృతి పట్ల అజయ్ దేవ్‌గన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తమ్ముడు అనిల్ దేవ్‌గన్‌ను గత రాత్రి భౌతికంగా కోల్పోయామని, అతని ఆకస్మిక మరణం తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని అజయ్ దేవ్‌గన్ ట్వీట్ చేశారు. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అజయ్ దేవ్‌గన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘Chalte Chalte’ fame Vishal Anand passes away
బాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ ఆనంద్‌ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశాల్‌ ఆనంద్‌.. అక్టోబర్‌ 4(ఆదివారం) మృతి చెందారు.

ఆయన పూర్తి పేరు భీష్మం కోహ్లీ. నటుడిగా ఆయన 1976 చేసిన ‘చల్తే చల్తే’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. సుమారు 11 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. ఆ తర్వాత దర్శకుడిగానూ, నిర్మాతగానూ తనదైన మార్క్‌ను చాటారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పిలహరికి బాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడిగా విశాల్‌ ఆనంద్‌ పేరు అందరికీ పరిచయమే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుపుతూ.. బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు