Music Shop Murthy : ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ రివ్యూ.. హీరోగా అజయ్ ఘోష్ నవ్వించి, ఏడిపించి..

ఓ 50 ఏళ్ళ మిడిల్ క్లాస్ వ్యక్తి డీజే గా మారాలనుకునే కథాంశం అని టీజర్, ట్రైలర్స్ లో చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Music Shop Murthy Movie Review : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సీనియర్ నటుడు అజయ్ ఘోష్ మెయిన్ లీడ్ లో, అలాగే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే చాందినీ చౌదరి, ఆమని, భానుచందర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఓ 50 ఏళ్ళ మిడిల్ క్లాస్ వ్యక్తి డీజే గా మారాలనుకునే కథాంశం అని టీజర్, ట్రైలర్స్ లో చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మ్యూజిక్ షాప్ మూర్తి నేడు జూన్ 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజవుతుండగా ముందే ఈ సినిమా కొంతమందికి ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. వినుకొండలో మూర్తి(అజయ్ ఘోష్) ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ క్యాసెట్లు అద్దెకిచ్చి, పాటలు ఎక్కించడం, ఫంక్షన్స్ కి సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ ఉంటాడు. అతని సంపాదన చాలక ఇంట్లో తన భార్య(ఆమని) కూడా కష్టపడుతూ మరో పక్క సంపాదన లేదు ఆ మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందాం అంటూ పోరుతూ ఉంటుంది. మూర్తి ఓ పార్టీలో పాటలు మిక్స్ చేసి బాగా ప్లే చేయడంతో అందరూ అభినందించి DJ అయి ఉంటే బాగుండేది, బాగా డబ్బులు ఇస్తారు అని చెప్పడంతో తన కష్టాలు తీరడానికి అయినా డబ్బుల కోసం DJ అవ్వాలనుకొని ఆన్లైన్ లో దాని గురించి తెలుసుకుంటూ ఉంటాడు.

మరో పక్క DJ అవ్వాలనుకునే అంజనా(చాందిని)ని తండ్రి(భాను చందర్) కంట్రోల్ లో పెడుతూ ఉండగా వాళ్ళిద్దరికీ జరిగిన గొడవలో అంజనా తండ్రి DJ కన్సోల్(DJ ప్లే చేసే పరికరం)ని పగలగొడతాడు. అది రిపేర్ కోసం ఊరంతా తిరుగుతూ మ్యూజిక్ షాప్ మూర్తి వద్దకు వస్తుంది అంజనా. DJ కన్సోల్ బాగు చేస్తా కాని తనకి DJ నేర్పించమని మూర్తి అడగడంతో అతనికి మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఓకే చెప్తుంది. మరి అంజనా మూర్తికి DJ నేర్పిందా? మూర్తి DJ అయ్యాడా? మూర్తి, అంజనా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే ఊళ్ళో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మూర్తి భార్య సపోర్ట్ చేసిందా? DJ అవ్వాలని హైదరాబాద్ వచ్చి మూర్తి పడ్డ కష్టాలేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమాల విశ్లేషణ.. ఒక మాములు వ్యక్తి తన డ్రీం కోసం పడే కష్టాలు గతంలో చాలా సినిమాల్లో చూసాము కాని ఈ సినిమాలో కథాంశం కొత్తగా ఉంటుంది. ఒక 50 ఏళ్ళ వ్యక్తి, అతనికి మ్యూజిక్ పై ఉన్న ఆసక్తి, కుటుంబం కష్టాలు అంటూ మూర్తి పాత్రను బాగా రాసుకున్నారు. ఆ పాత్రకు 20 ఏళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అంటూ DJ నేర్పించే అంజనా పాత్రని కూడా అద్భుతంగా రాసుకున్నారు. సినిమా మొదలయిన ఓ పది నిముషాలు నిదానంగా సాగినా ఆ తర్వాత మాత్రం ఫుల్ గానే నవ్విస్తారు. ఫస్ట్ హాఫ్ లో మూర్తి గురించి, అతను చేసే పని, అంజనా పరిచయం, DJ నేర్చుకోవడం, మూర్తి ఇంట్లో కష్టాలు, ఈసడింపులు.. ఇలా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లి ఇంటర్వెల్ కి ఓ ఎమోషన్ తో ఆసక్తి కలిగిస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో DJ అవ్వాలని మూర్తి పడ్డ కష్టాలని, ఎలా అయ్యాడు అంటూ మరింత ఆసక్తిగా చూపించారు. క్లైమాక్స్ లో ఎమోషన్ తో కన్నీళ్లు కూడా తెప్పిస్తారు. DJ గురించి మాత్రం బాగానే రీసెర్చ్ చేశారు ఈ సినిమా కోసం.

Also Read : Nee Dhaarey Nee Katha : ‘నీ దారే నీ కథ’ మూవీ రివ్యూ.. మ్యూజికల్ కథనంతో..

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు విలన్ గా, కమెడియన్ గా మెప్పించిన అజయ్ ఘోష్ మొదటిసారి మెయిన్ లీడ్ లో చేసి ఓ 50 ఏళ్ళ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు, అతను DJ అయితే ఎలా ఉంటాడు అని పర్ఫెక్ట్ గా అదిరిపోయేలా నటించాడు. ఓ పక్క నవ్వించి మరో పక్క ఏడిపించాడు అజయ్ ఘోష్. మోడ్రన్ అమ్మాయిగా చాందిని కూడా ఆ పాత్రలో బాగా నటించింది. అజయ్ ఘోష్ భార్య పాత్రలో ఆమని కూడా సాధారణ గృహిణిలా మెప్పిస్తుంది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నాని.. మిగిలిన నటీనటులు కూడా చక్కాగా నటించి మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు అన్ని బాగా కుదిరాయి. కథ బేసిక్ పాయింట్ పాతదే అయినా కథనం చాలా కొత్తగా రాసుకున్నారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ షాప్, అక్కడ బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు. పాటలు ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఎమోషన్ సీన్స్ లో మరింత బాగా ఇచ్చారు మ్యూజిక్. దర్శకుడిగా మొదటి సినిమాతోనే శివ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఓ 50 ఏళ్ళ వ్యక్తి DJ అవ్వాలనుకుంటే ఓ 25 ఏళ్ళ అమ్మాయి ఎలా సపోర్ట్ చేసింది అని ఆసక్తిగా ఎంటర్టైన్మెంట్ తో చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు