Buddy : ‘బడ్డీ’ మూవీ రివ్యూ.. అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తే..

పిల్లలతో ఈ సినిమాకు వెళ్తే థియేటర్లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

Allu Sirish Buddy Movie Review and Rating

Buddy Movie Review : అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్ జంటగా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మాణంలో సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘బడ్డీ’. అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీ.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. బడ్డీ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. ఆదిత్య రామ్(అల్లు శిరీష్) ఓ పైలట్. పల్లవి(గాయత్రీ భరద్వాజ్) ఓ ATC (విమానాశ్రయంలో కూర్చొని పైలట్స్ తో ఫ్లైట్ ల్యాండ్ చేయించేవాళ్ళు)గా పనిచేస్తూ ఉంటుంది. దీంతో ఆదిత్య, పల్లవి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది. పల్లవి ఆదిత్యని చూసినా ఆదిత్య మాత్రం పల్లవిని చూడడు. వీళ్లిద్దరు కలుద్దామనుకునే సమయానికి అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల ఆదిత్య జాబ్ పోతుంది. ఆదిత్య జాబ్ తన వల్లే పోయిందని తనని కలిసి సారీ చెప్దామనుకునేలోపు పల్లవి కిడ్నాప్ అవుతుంది.

హాంగ్ కాంగ్ లో డాక్టర్ అర్జున్ ఆర్గాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఓ డ్రగ్ డాన్ కొడుకుకి కావాల్సిన హార్ట్ పల్లవిది సరిపోతుందని తెలియడంతో ఆమెని కిడ్నాప్ చేయించి హాంగ్ కాంగ్ కి తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో పల్లవి కోమాలోకి వెళ్లడంతో ఆమె ప్రాణం ఆదిత్య గిఫ్ట్ గా ఇచ్చిన ఒక టెడ్డీ బేర్ లోకి వెళ్తుంది. మరి ఆ టెడ్డీ ఆదిత్య రామ్ ని ఎలా కలిసింది? తనే ATC అమ్మాయి అని చెప్పిందా? పల్లవిని ఆదిత్య టెడ్డీ సహాయంతో ఎలా కాపాడాడు? వీరి ప్రేమ గురించి ఒకరికొకరికి తెలిసిందా? అసలు ఆదిత్య జాబ్ ఎలా పోయింది, మళ్ళీ తిరిగొచ్చిందా? మళ్ళీ టెడ్డీ నుంచి పల్లవి ప్రాణం తన బాడీలోకి వచ్చిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Viraaji : ‘విరాజి’ మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ సినిమాతో వరుణ్ సందేశ్..

సినిమా విశ్లేషణ.. బడ్డీ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా ఇది తమిళ సినిమా టెడ్డీ లాగే ఉంది అని అంతా అనుకున్నారు. అయితే అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తుంది అనే బేసిక్ పాయింట్ అదే అయినా కథ, స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా వేరు. ఫస్ట్ హాఫ్ ఆదిత్య, పల్లవి ఒకర్నొకరు చూసుకోకుండానే వీరిద్దరి ప్రయాణం, డాక్టర్ అర్జున్ గురించి చూపించడం, పల్లవి కిడ్నాప్ అయి ప్రాణం టెడ్డీలోకి రావడం, టెడ్డీ ఆదిత్యని కలవడం చూపిస్తారు. ఆదిత్య ఎలా కాపాడతాడు అని ఆసక్తికరంగా ఇంటర్వెల్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో టెడ్డీ చేసే విన్యాసాలు, ఆదిత్య హ్యాంగ్ కాంగ్ కి ఎలా వెళ్ళాడు? అక్కడ యాక్షన్ సీక్వెన్స్ లతో ఓ పక్క కామెడీ, మరో పక్క యాక్షన్స్ తో ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది.

సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోవడం చాలా ప్లస్ పాయింట్. ఇక టెడ్డీ చేసే కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ లు పిల్లలకు బాగా నచ్చుతాయి. సినిమాలో వచ్చే తెలుగు పాటలు, జై బాలయ్య రిఫరెన్స్ లు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా తమిళ్ టెడ్డీ సినిమా చూడకుండా వెళ్తే మాత్రం బాగా నచ్చుతుంది ఈ బడ్డీ సినిమా. తమిళ్ టెడ్డీ సినిమా చూసి బడ్డీ సినిమా చూస్తే మాత్రం అదే సినిమా గుర్తుకు వస్తుంది. బడ్డీలో ముఖ్యంగా ఆకాశంలో ఉండే అబ్బాయి – భూమి మీద ఉండే అమ్మాయి అంటూ లవ్ స్టోరీని కొత్తగా చూపించారు. క్లైమాక్స్ ఫైట్ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ లో జరగడం, విమానాశ్రయం సెటప్స్ పరంగా బాగానే చూపించినా చిన్న చిన్న లాజిక్స్ వదిలేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. అల్లు శిరీష్ పైలట్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించి నటనతో కూడా మెప్పించాడు. గాయత్రీ భరద్వాజ్ చాలా క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. ప్రిషా సింగ్ అందంతో పాటు బాగానే నటించింది. అలీ, ముకేశ్ రిషి ఓ పక్క అప్పుడప్పుడు నవ్విస్తూనే సీరియస్ యాక్టింగ్ చేసారు. నెగిటివ్ రోల్ లో అజ్మల్ అమీర్ బాగా నటించాడు. టెడ్డీ అయితే అదరగొట్టేసింది. మిగిలిన నటీనటులు అంతా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా, చాలా రిచ్ గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు. ఇక విమానం సెటప్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. కథ పాతదే అయినా కథనం కొత్తగా రాసుకొని దర్శకుడిగా బడ్డీ సినిమాని తెరకెక్కించడంలో డైరెక్టర్ సామ్ ఆంటోని సక్సెస్ అయ్యాడు. ఇక బడ్డీ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ నిర్మించడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.

మొత్తంగా ఓ అమ్మాయి ప్రాణం ఒక టెడ్డీ బేర్ లోకి వస్తే హీరోతో కలిసి తనని ఎలా కాపాడుకుంది అని ఫుల్ ఎంటర్టైనింగ్, ఎమోషన్ గా చూపించారు. పిల్లలతో ఈ సినిమాకు వెళ్తే థియేటర్లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు