Baahubali The Epic
Baahubali The Epic Review : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు భారీ విజయం సాధించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచి పాన్ ఇండియా సినిమాలకు లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణంలో ఈ సినిమాలను భారీగా తెరకెక్కించారు. రానా విలన్ గా, అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నాజర్, రమ్యకృష్ణ, ప్రభాకర్, సుబ్బరాజు, సత్యరాజ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ఆ రెండు సినిమాలను కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాగా నేడు అక్టోబర్ 31న రిలీజ్ చేసారు. ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ కూడా వేశారు.
కథ విషయానికొస్తే.. శివగామి(రమ్యకృష్ణ) చంటి బిడ్డ మహేంద్ర బాహుబలిని కాపాడాలని మాహిష్మతి నుంచి తప్పించుకొని కింద ఉన్న జలాల్లోకి రావడంతో కథ మొదలవుతుంది. అక్కడి గ్రామ జనాలు ఆ బిడ్డని చూసి శివుడు(ప్రభాస్)గా పెంచుకుంటారు. శివుడు ఎప్పటికైనా జలపాతం వచ్చే కొండా ఎక్కాలని ట్రై చేసి ఓ రోజు ఎక్కుతాడు. అక్కడ అవంతిక(తమన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. తను కూడా శివుడి ప్రేమలో పడినా తమ లక్ష్యం దేవసేన(అనుష్క)ని మాహిష్మతి నుంచి విడిపించడమే అని వెళ్ళిపోతే నేను దేవసేనని విడిపిస్తాను అని శివుడు మాహిష్మతికి బయలుదేరుతాడు.
అక్కడ మాహిష్మతి రాజు భల్లాలదేవ(రానా) దగ్గర దేవసేన బందీగా ఉంటుంది. భల్లాల దేవా భారీ విగ్రహం పెట్టె సమయంలో శివుడు అక్కడికి ఎంటర్ అవ్వడంతో ఓ వ్యక్తి అతన్ని చూసి బాహుబలి అంటారు. దీంతో ఆ ప్రాంగణమంతా బాహుబలి పేరుతో మారుమ్రోగిపోతుంది. ఎప్పుడో చనిపోయాడు, జనాలు మర్చిపోయారు అనుకున్న బాహుబలి పేరు మళ్ళీ ఎందుకు వినిపించింది అని భల్లాలదేవ మదనపడతాడు. అసలు బాహుబలి ఎవరు? అతను ఎలా చనిపోయాడు? దేవసేన భల్లాలదేవ దగ్గర ఎందుకు బందీగా ఉంది? అవంతిక ఎవరు? శివుడు దేవసేనని కాపాడతాడా? శివగామి ఎందుకు చంటి బిడ్డతో పారిపోయింది.. ఇవన్నీ తెలియాలంటే కొత్తగా కట్ చేసిన బాహుబలి ది ఎపిక్ సినిమా చూడాల్సిందే..
బాహుబలి రెండు పార్టులు పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ కథ అందరికి తెలుసు. మొదటి పార్ట్ శివుడు, అవంతిక ప్రేమ కథతో పాటు బాహుబలి గురించి కొంచెం చెప్పి కట్టప్ప బాహుబలిని చంపాడు, ఎందుకు చంపాడు అని సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి అప్పట్లో రెండేళ్లు వెయిట్ చేసేలా చేసారు. ఇప్పుడు ఆ సినిమా అంతా ఫస్ట్ పార్ట్ లో ఒక గంట 40 నిమిషాల్లో చూపించేసారు. శివుడు కొండ ఎక్కడానికి ప్రయత్నించే సీన్స్ చాలా వరకు కట్ చేసారు. అవంతిక శివుడి లవ్ ట్రాక్ మొత్తం కట్ చేసేసారు. అవంతిక సీన్స్ చాలా వరకు తీసేసారు. పచ్చబొట్టేసిన సాంగ్ తీసేసారు. మనోహరి సాంగ్ తీసేసారు. మమతల తల్లి సాంగ్ తీసేసారు. అవంతిక శివుడు లవ్ స్టోరీ మొత్తం ఒక నిమిషంలో రాజమౌళి వాయిస్ ఓవర్ తో చెప్పడం గమనార్హం. సుదీప్ – కట్టప్ప సీన్ కట్ చేసారు. ఫస్ట్ హాఫ్ లో శివుడు మాహిష్మతి లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక కొత్త సీన్ జత చేసారు. శివుడి ఎంట్రీకి తగ్గట్టు బిజ్జలదేవ డైలాగ్స్ తో అదిరిపోయే ఎలివేషన్స్ తో ఆ సీన్ ని డిజైన్ చేసారు. శివుడి ఎంట్రీ బిజ్జలదేవ ఎలివేషన్స్ కి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆ సీన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..
ఇక బాహుబలి సెకండ్ పార్ట్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, బాహుబలి – దేవసేన ప్రేమకథ, శివుడు భల్లాల దేవని ఎలా అంతం చేసాడు అని ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్ లో 2 గంటల్లో చూపించేసారు. సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న సీన్స్ మాత్రమే కట్ చేసారు. సుబ్బరాజు సీన్ ఒకటి, కన్నా నిదురించారా సాంగ్ ఒకటి కట్ చేసారు. అన్ని యుద్ధ సన్నివేశాల్లో కూడా చిన్న చిన్న సీన్స్ కట్ చేసారు. చివరి యుద్ధంలో కట్టప్పతో బిజ్జలదేవ మాట్లాడే సీన్ కట్ చేసారు.
బాహుబలి రెండు పార్టులను చూడకుండా ఈ సినిమా చూస్తే ఇదే బాగుంది అనిపిస్తుంది. ఎక్కడా ఎమోషన్ మిస్ అవ్వకుండా, అదే రేంజ్ గూస్ బంప్స్ వచ్చేవిధంగా సినిమాని ఎడిట్ చేసారు. చాలా సీన్స్ లో ల్యాగ్ లేకుండా షార్ప్ ఎడిటింగ్ చేసారు. మొత్తం సినిమా 3 గంటల 45 నిముషాలు ఉంది. ది ఎపిక్ టైటిల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. పదేళ్ల తర్వాత థియేటర్లో చూస్తే మళ్ళీ అదే విజువల్ వండర్ గా అద్భుతంగా అనిపించడం ఖాయం. ఫ్యాన్స్, సినిమా లవర్స్ తో పాటు మాములు ప్రేక్షకులు కూడా బాహుబలి ది ఎపిక్ సినిమాని థియేటర్లో చూడొచ్చు. అలాగే బాహుబలి 3 కాకుండా బాహుబలి ఎటర్నల్ వార్ అని యానిమేషన్ సినిమాని ప్రకటించి దాని టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఆ టీజర్ కూడా అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ బాహుబలి ది ఎటర్నల్ వార్ 3D యానిమేషన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
బాహుబలి రెండు సినిమాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా ఒక విజువల్ వండర్ అని తెలిసిందే. అయితే ఈసారి మరింత కలర్ గ్రేడింగ్, DI మరోసారి చేసి ఇంకా అద్భుతంగా చూపించారు. కానీ అక్కడక్కడా కొన్ని రాత్రి సన్నివేశాల్లో మాత్రం కొత్తగా చేసిన కలర్ గ్రేడింగ్ కుదరలేదు అనిపిస్తుంది. దానికంటే ఒరిజినల్ బాగుంది అనిపిస్తుంది. మిగిలిన అన్ని సన్నివేశాల్లో కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటుంది. అలాగే సౌండ్ డిజైన్ కూడా మరింత డెవలప్ చేసారు. అన్ని ఫార్మెట్స్ కి తగ్గట్టు సౌండ్ ని అడ్జస్ట్ చేసారు. PCX స్క్రీన్స్ లాంటి థియేటర్స్ లో బాహుబలి ది ఎపిక్ చూస్తే ఆ అనుభవం చాలా బాగుంటుంది.
కాస్ట్యూమ్స్, లొకేషన్స్, ఆర్ట్ వర్క్ అన్ని ది బెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ది ఎపిక్ సినిమాకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. కథని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా సీన్స్ తొలగించి పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసారు. మొదటిసారి బాహుబలిని చూస్తే ఇదే అసలైన సినిమా అనిపించడం ఖాయం. అయితే ఇంకా కొన్ని సీన్స్ లో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల హావభావాలు షార్ప్ కట్ చేసే అవకాశం కూడా ఉంది. విజయేంద్రప్రసాద్ కథ అందరికి ఎప్పుడో నచ్చేసింది. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ గురించి ఆల్రెడీ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. బాహుబలి సినిమాని ఎంతో గొప్పగా అందించడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేయడం అభినందించదగ్గ విషయం.
ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్, ప్రభాకర్.. ఇలా బాహుబలి సినిమాలో నటించిన వాళ్లంతా తమ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రలో నటించి జనాల్ని మెప్పించారు అని సినిమా చూసినంతసేపు మరోసారి అనిపించడం ఖాయం.
థియేటర్స్ లో ‘బాహుబలి ది ఎపిక్’ సినిమాని చూస్తే సరికొత్త అనుభవం పొందడం ఖాయం. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్లొచ్చు. బాహుబలి సినిమాల లాగే ది ఎపిక్ కూడా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు కొట్టేలా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ హౌస్ ఫుల్ తో ది ఎపిక్ దూసుకుపోతుంది.