కరోనాతో మృతి చెందిన దిగ్గజ నటుడు

Soumitra Chatterjee: కరోనా సినీ పరిశ్రమను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కోలుకోగా కొందరు ఈ మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ కోల్‌కత్తాలో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.
గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించిందని, ఆయనను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డు పొందిన సౌమిత్ర ఛటర్జీ, లెజెండరీ దర్శకులు సత్యజిత్ రే తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ‘అపుర్ సంసార్’ తో చిత్ర రంగ ప్రవేశం చేశారు. సత్యజిత్‌రే దర్శకత్వంలో దాదాపు 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం.
‘ఘరె బైరె, అరణ్యర్ దిన్ రాత్రి, చారులత’ చిత్రాలు సౌమిత్రకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. వారి ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.