Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..

భద్రకాళి సినిమా విజయ్ ఆంటోనికి 25వ సినిమా కావడం గమనార్హం. (Bhadrakaali Review)

Bhadrakaali Review

Bhadrakaali Review : హీరో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన సినిమా ‘భద్రకాళి’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మాణంలో అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తృప్తి రవీంద్ర, రియా జీతూ హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. భద్రకాళి సినిమా నేడు సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది.(Bhadrakaali Review)

కథ విషయానికొస్తే.. కిట్టు(విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్ లో ఒక బ్రోకర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్లకు ఎలాంటి పని అయినా చేసి పెట్టి కమిషన్స్ తీసుకుంటాడు. కింద నుంచి పై స్థాయి వరకు చిన్న చిన్న పనుల నుంచి కోట్లల్లో జరిగే పనుల వరకు అన్నీ చేసి అందర్నీ డీల్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పేదలకు సాయం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన దగ్గరికి ఒక పని చేస్తే 200 కోట్లు ఇస్తామని వస్తారు. ముందు ఆలోచించినా డబ్బు కోసం ఓకే చెప్పి ఆ పని చేస్తాడు. కానీ ఆ పని జరిగినా ఇతనికే రివర్స్ అవుతుంది.

కిట్టు చేసే కొన్ని పనులు ఇండైరెక్ట్ గా దేశంలోనే ధనవంతుడైన అభ్యంకర్(సునీల్ కృపాలాని) కి ఎఫెక్ట్ అవుతాయి. గతంలో కిట్టు అభ్యంకర్ ఇంట్లో నమ్మకంగా పనిచేసినవాడే. కిట్టు చేసిన పనులు తెలియడంతో అతను బ్రోకరిజం చేసి కోట్లల్లో సంపాదించాడని తెలుస్తుంది. దీంతో అభ్యంకర్ ఒక స్పెషల్ టీం పెట్టి, తన పవర్ వాడి కిట్టుని, కిట్టు భార్య వేదా(తృప్తి రవీంద్ర), అతని మనుషులను అరెస్ట్ చేయిస్తాడు. కిట్టు దాచిన 6200 కోట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి కిట్టుని చిత్రహింసలు పెడుతుంటారు. చివరికి కిట్టు ఆ డబ్బు ఎక్కడుందో, తాను సంపాదించిన డబ్బు ఏం చేసాడో తెలియగానే అతన్ని వదిలేసి అతనిపై చాలా కేసులు పెట్టి ఓ పదేళ్ల పాటు జైలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తాడు. మరో పక్క అభ్యంకర్ దేశ రాష్ట్రపతి అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. మరి కిట్టు ఎలా తప్పించుకున్నాడు? మళ్ళీ కిట్టు ఎలా సంపాదించాడు? కిట్టుకి – అభ్యంకర్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి? అభ్యంకర్ రాష్ట్రపతి అవ్వకుండా కిట్టు ఎలా అడ్డుకున్నాడు? కిట్టు – వేద లవ్ స్టోరీ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Beauty Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్..

సినిమా విశ్లేషణ..

ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొదలవుతుంది. అక్కడ చూపించే ఓ చిన్న బాబే హీరో అని అందరికి అర్థమైపోతుంది. ఫస్ట్ సీన్ లోనే విలన్ – హీరో ఎస్టాబ్లిష్, రివెంజ్ స్టోరీ అన్నట్టు చేయడంతో కథపై ఆసక్తి రాదు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కిట్టు బ్రోకర్ గా ఎలా పనిచేస్తాడు, అందర్నీ ఎలా డీల్ చేస్తాడు, డబ్బులు ఎలా సంపాదిస్తాడు అనే బాగా చూపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా రైటింగ్ బాగా రాసుకున్నారు. ఆర్పీ పట్నాయక్ బ్రోకర్ సినిమా కొంత గుర్తుకు రాక మానదు. మధ్యలో లవ్ స్టోరీ సింపుల్ గా కథతో నడుస్తూనే చూపించడం బాగుంది.

అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. కిట్టుని అరెస్ట్ చేయడంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ రివెంజ్ స్టోరీ తో పాటు, దేశాన్ని బాగు చేయాలి, పేదలకు న్యాయం జరగాలి అని క్లాసులు పీకే కథనంతో సాగుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్ గా హీరో కోసం అందరూ వెతకడం హీరో దూరంగా ఉండి టెక్నాలజీతో మాట్లాడటం, విలన్ ని చంపడం రొటీన్ గా సాగుతుంది.

బ్రోకర్, ఇజం, ఠాగూర్.. ఇలా చాలా సినిమాల రిఫరెన్స్ లు కనిపిస్తాయి. బిజినెస్ మెన్స్, పొలిటీషియన్స్ అందరూ చెడ్డవాళ్లే అన్నట్టు చిత్రీకరించి, వాళ్ళ లాగా మనం ఎదగలేం అన్న బాధలోంచి, ఆలోచనలలోంచి ఇలాంటి కథలు వచ్చినట్టు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా రాసుకోగా సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ కథ, స్క్రీన్ ప్లే తో బోరింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ ఓ రేంజ్ లో ఉంటుంది అనుకుంటాం. కానీ చాలా రొటీన్ గా సాగడంతో నిరాశ తప్పదు. చివరకు ఇదొక రెగ్యులర్ రివెంజ్ స్టోరీ అన్నట్టు మార్చేశారు. ఈ సినిమా విజయ్ ఆంటోనికి 25వ సినిమా కావడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

విజయ్ ఆంటోనీ ఎప్పట్లాగే తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో బాగానే మెప్పించాడు. కిట్టు భార్య పాత్రలో తృప్తి రవీంద్ర చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సునీల్ కృపాలాని నెగిటివ్ పాత్రలో బాగానే నటించారు. స్పెషల్ పోలీస్ పాత్రలో నటించిన వ్యక్తి చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. సెల్ మురుగన్, వాగై చంద్రశేఖర్.. మిగిలిన తమిళ నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Bandla Ganesh : ఇండస్ట్రీ మాఫియా మనల్ని బతకనివ్వదు.. మౌళికి క్లాస్ పీకిన బండ్ల గణేష్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు యావరేజ్. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కథ పరంగా పాత రొటీన్ కథే అయినా ఫస్ట్ హాఫ్ రైటింగ్ బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయింది. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘భద్రకాళి’ సినిమా ఓ బ్రోకర్ ఏం చేశాడు, ఎంత సంపాదిస్తాడు, తన రివెంజ్ ని ఎలా తీర్చుకున్నాడు అనే రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.