Beauty Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్..
ఓ మిడిల్ క్లాస్ కాలేజీ యువతి జీవితంలోకి ప్రేమ రావడంతో ఏం జరిగింది. (Beauty Review)

Beauty Review
Beauty Review : అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటించిన సినిమా బ్యూటీ. మారుతి టీం, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో JSS వర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్, వాసుకి, సోనియా, నితిన్ ప్రసన్న, మురళీధర్ గౌడ్, ప్రసాద్ బెహరా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. బ్యూటీ సినిమా రేపు సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Beauty Review)
కథ విషయానికొస్తే.. అలేఖ్య(నీలఖి పాత్ర) కాలేజీ చదువుతుంది. తన తండ్రి నారాయణ(నరేష్) ఓ క్యాబ్ డ్రైవర్. తన స్థోమతకు మించి కూతురు కోసం ఖర్చుపెడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ కొనుక్కుందని అలేఖ్య తనకు కూడా స్కూటీ కావాలని తండ్రిని అడుగుతుంది. దీంతో స్కూటీ నేర్చుకుంటే కొనిస్తాను అంటాడు. ఈ క్రమంలో అలేఖ్యకు అనుకోకుండా అర్జున్(అంకిత్ కొయ్య) పరిచయం అయి స్కూటీ నేర్పిస్తాడు. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు.
ఓ సారి అలేఖ్య అర్జున్ తో రొమాంటిక్ వీడియో కాల్ మాట్లాడుతుంటే తల్లి (వాసుకి) కొడుతుంది. అంతకుముందే అలేఖ్య – అర్జున్ రెడ్ హ్యాండెడ్ గా పక్కింటి వాళ్లకు దొరుకుతారు. దీంతో తన తల్లి చంపేస్తుందని భయపడి అర్జున్ ని ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతుంది. ఏం కాదు అని అర్జున్ ఎంత చెప్పినా అలేఖ్య వినకపోవడంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్ కి వెళ్తారు. ఈ విషయం అలేఖ్య తండ్రి నారాయణకు తెలిసి అతను కూడా కూతుర్ని వెతుక్కుంటూ హైదరాబాద్ కి వెళ్తాడు. ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలతో అలేఖ్య – అర్జున్ లను హైదరాబాద్ పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. అసలు అలేఖ్య – అర్జున్ లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? నారాయణకు తన కూతురు దొరికిందా? అలేఖ్య – అర్జున్ ప్రేమకథ ఏమైంది? నారాయణ కూతురు కోసం స్కూటీ కొన్నాడా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
ఫస్ట్ హాఫ్ అంతా అలేఖ్య గురించి, ఆమె ఫ్యామిలీ, బండి కోసం ఆమె తపన చూపిస్తూ అర్జున్ తో లవ్ స్టోరీ నడిపించారు. ఇంటర్వెల్ కి వీళ్ళిద్దరూ లేచిపోవడం చూపెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ అంతా కూతురు కోసం తండ్రి పడే ఎమోషన్ ని ఎక్కువగా చూపించారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించరు. సాధారణంగా ఆ ట్విస్ట్ చాలా సినిమాల్లో ఉన్నదే కానీ బ్యూటీ సినిమాని ముందు నుంచి నడిపిన తీరుతో ఆ ట్విస్ట్ ని ఎవ్వరూ ఊహించలేరు. అప్పటిదాకా సింపుల్ గా సాగిన కథకి ఆ ట్విస్ట్ చాలా ప్లస్ అయింది.
కథ పరంగా ఇది రొటీన్ పాత కథ. గతంలో తేజ ఇలాంటివి చాలా సినిమాలు తీసేసాడు. తేజ సినిమాలు, పరుగు, బుట్టబొమ్మ సినిమా కథలను కలిపి చివర్లో ఓ ట్విస్ట్ పెట్టి బ్యూటీ సినిమాని తీశారు అనిపిస్తుంది. అయితే ఇది రియల్ గా జరిగిన సంఘటనలతో తెరకెక్కించారు అని మూవీ యూనిట్ చెప్పారు. సినిమా ఎండింగ్ కూడా సడెన్ గా ఆపేసినట్టు, ఓ పర్ఫెక్ట్ ఎండింగ్ లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇక మైనర్ అయిన అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చారు.. లాంటి లాజిక్ లెస్ సీన్స్ కొన్ని ఉన్నాయి.
కొన్ని సీన్స్ అయితే సీరియల్స్ లో డ్రమాటిక్ సీన్స్ లా బాగా సాగదీసారు. సెకండ్ హాఫ్ లో తండ్రి ఎమోషన్ ని మాత్రం బాగా చూపించారు. ఒక కూతురు అంటే పేరెంట్స్ కి ఎంత ఇష్టం, తన కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారు, ప్రేమ పేరుతో కూతురు వెళ్ళిపోతే పేరెంట్స్ ఎంత బాధపడతారు అనే మెసేజ్ ని ఈ బ్యూటీ సినిమాతో చెప్పడానికి ప్రయత్నించారు. ఇక టైటిల్ కి, సినిమాకి సంబంధం ఏంటో మూవీ యూనిట్ కే తెలియాలి. అక్కడక్కడా కామెడీ ట్రాక్స్ రాసుకున్నా ఒకటి రెండు నవ్వులు తప్ప అంతగా వర్కౌట్ అవ్వలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మెప్పించిన అంకిత్ కొయ్య ఈ సినిమాలో మొదటిసారి తన పర్ఫార్మెన్స్ తో బాగా మెప్పించాడు. ఒడియా భామ నీలఖి పాత్ర క్యూట్ గా అలరిస్తూనే ఎమోషన్ సీన్స్ ని బాగా పండించింది. సీనియర్ నటుడు నరేష్ ఒక ఆడపిల్ల తండ్రిగా పర్ఫెక్ట్ గా సెట్ అయి ఎమోషన్ తో మెప్పించారు. వాసుకి కూడా తల్లి పాత్రలో, మిడిల్ క్లాస్ గృహిణిగా ఆ పాత్రకు న్యాయం చేసింది. ప్రసాద్ బెహరా కాసేపు నవ్వించాడు. సిన్సియర్ పోలీస్ పాత్రలో నితిన్ ప్రసన్న బాగానే అలరించాడు. మురళీధర్ గౌడ్, నాగేంద్ర.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఆ ఓటీటీలోనే.. ఈ ఫొటోతో క్లారిటీ వచ్చేసింది..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. వైజాగ్, హైదరాబాద్ లో రియల్ లొకేషన్స్ లోనే షూటింగ్ చేయడంతో సీన్స్ లో న్యాచురాలిటీ కనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ లో సీరియల్స్ సీన్స్ లా అసాగిన కొన్ని సీన్స్ షార్ప్ ఎడిట్ చేస్తే బాగుండేది. రియల్ గా జరిగిన ఓ క్రైమ్ ఆధారంగా ఈ కథను రాసినా ఇది చాలా పాత కథే. కాకపోతే రొటీన్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ గానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘బ్యూటీ’ సినిమా ఓ మిడిల్ క్లాస్ యువతి జీవితం, ఆమె ప్రేమకథతో, ఓ క్రైమ్ కి లింక్ చేసి రొమాంటిక్ థ్రిల్లింగ్ సినిమాలా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.