Zeenat Aman : సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితిని షేర్ చేసిన నటి.. ప్టోసిస్‌తో బాధపడుతూ..

71 ఏళ్ల బాలీవుడ్ నటి జీనత్ అమన్ ప్టోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

Zeenat Aman

Zeenat Aman : బాలీవుడ్ నటి జీనత్ అమన్ ఇన్ స్టాగ్రామ్‌లో తన ఆరోగ్య పరిస్థితిని పంచుకున్నారు. 71 ఏళ్ల ఈ నటి ‘ప్టోసిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అసలు ప్టోసిస్ అంటే ఏంటి? ఈ నటికి ఏమైంది?

నటి జీనత్ అమన్ అసలు పేరు జీనత్ ఖాన్. 1970 లో ఫెమినా మిస్ ఇండియాగా గెలిచి ఆ తర్వాత నటిగా స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. 1978 లో నటుడు సంజయ్ ఖాన్‌ను పెళ్లాడి 1979 లో విడాకులు తీసుకున్నారు అమన్. 1985 లో నటుడు మజార్ ఖాన్‌ను రెండో పెళ్లి  చేసుకున్నారు. అతనితో గడిపిన వైవాహిక జీవితంలో ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నట్లు తెలుస్తోంది.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి హంగామా ఇంకా అవ్వలేదు.. మళ్లీ సక్సెస్ సెలెబ్రేషన్స్..

ఇదిలా ఉంటే 71 సంవత్సరాల ఈ నటి ఇప్పుడు ప్టోసిస్ అనే కంటి వ్యాధితో బాధపడుతున్నారు. తన మాజీ భర్త సంజయ్ ఖాన్‌తో గొడవ పడిన సందర్భంలో కంటికి అయిన గాయం కారణంగా కుడి కన్ను చుట్టూ ఉన్న కండరాలు దెబ్బతిన్నాయట. దాంతో ఆమె కొన్నేళ్లుగా కంటి రెప్పను పైకి ఎత్తలేని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ప్టోసిస్‌గా చెప్పబడుతున్న ఈ పరిస్థితిని వివరిస్తూ జీనత్ అమన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

ప్టోసిస్ పరిస్థితి నుంచి బయటపడటానికి దశాబ్దకాలంగా ఆమెకు చికిత్స జరుగుతున్నా విజయవంతం కాలేదట. అయితే 2023 ఏప్రిల్‌లో ఓ ఫేమస్ ఐ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్‌తో తన పరిస్థితి కొంత మెరుగుపడిందని ఆమె తన పోస్టులో చెప్పారు. కనురెప్పను లేపడానికి.. కంటిచూపు మెరుగవడానికి ఆపరేషన్ అవసరం అవుతుందని ఆ వైద్యుడు చెప్పారట. దాంతో తను ఆపరేషన్‌కు సిద్ధపడినట్లు రాసుకొచ్చారు. తను ఉన్న పరిస్థితుల్లో తనకు సహకరించిన కుటుంబానికి తనకు ఆపరేషన్ చేసిన వైద్యులు డాక్టర్ సవారీ దేశాయ్‌కి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం తను రికవరి అవుతున్నానని.. కంటి చూపు కూడా బావుందని ఆమె తెలిపారు.

Allu Aravind : హీరోల రెమ్యునరేషన్స్, సినిమాల ఖర్చుపై అల్లు అరవింద్ కామెంట్స్..

జీనత్ అమన్ సత్యం శివం సుందరం, యాదోన్ కి బారాత్, హరే రామ హరే కృష్ణ మరియు డాన్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్టోసిస్ కారణంగా అవకాశాలు తగ్గినప్పటికీ ఆమె ధైర్యంగా ఉన్నారట. తన జీవితం చుట్టూ ఎన్నో గాసిప్‌లు, ఆరోపణలు, ప్రశ్నలు ఉన్నప్పటికీ వాటి గురించి తాను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని నిజానికి అలాంటి పరిస్థితుల్లో ఎవరు తనతో నిలబడ్డారో తెలిసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీనత్ పోస్టు వైరల్ అవుతోంది. చాలామంది ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుండాలని కామెంట్లు చేశారు.