కాలేజికి ముప్పు తెచ్చిన విజయ్ ఆడియో లాంచ్

విజయ్ నటించిన బిగిల్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించిన కాలేజీ చిక్కుల్లో పడింది. చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజికి తమిళనాడు ఉన్నత విద్యా డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాడు. దీనికి కారణం ముమ్మాటికి సెప్టెంబర్ 19న నిర్వహించిన బిగిల్ ఆడియో లాంచ్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలే.
విజయ్, నయనతార ప్రధానపాత్రల్లో నటిస్తున్న బిగిల్ సినిమా కోలీవుడ్ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్‌తో రానుంది. దీని ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నైలోని తాంబరం దగ్గర్లో ఉన్న శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజిలోని ఇండోర్ స్టేడియంలో
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ చేసిన కామెంట్లు సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపింది.
ఆయన చేసిన కామెంట్లు ఏఐడీఎంకే ప్రభుత్వాన్ని పరోక్షంగా నిందించినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఐటీ ఉద్యోగి అయిన శుభశ్రీపై అక్రమ హోర్డింగ్ పడి మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 12న జరిగిన ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం అక్రమ హోర్డింగ్ ఏర్పాటు చేసిన వాళ్లపై కాకుండా ప్రింట్ చేసిన వాళ్లను నిందించడం సబబు కాదన్నారు.
తన అభిమానులు, అజిత్ అభిమానులు సినిమాల గురించి వాదించుకోకుండా ఇలాంటి ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత పనులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాలపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే స్పందించలేదు.