Chiranjeevi : చిరంజీవి పుట్టిన రోజు.. సీనియర్ అభిమానులకు బంపర్ ఆఫర్.. ఏకంగా 5 లక్షలు..

చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే.(Chiranjeevi)

  • Published on- July 20, 2026 / 05:51 PM IST

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏకచత్రాధిపత్యంగా ఏలారు. ఇప్పుడు కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు.

ఇక చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే. ఆ రోజు రెండు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు అభిమానులు. అయితే ఆ రోజు ఓ పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు అఖిల భారత చిరంజీవి యువత సంఘం. ఈ సంస్థ ప్రసిడెంట్, చిరంజీవి అభిమాని రవణం స్వామి నాయుడు కీలక ప్రకటన చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Also Read : Lenin Collections : ‘లెనిన్’ సినిమాకు ఎన్ని కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి? వంద కోట్ల పోస్టర్ వేస్తారా?

ఈ వీడియోలో స్వామి నాయుడు మాట్లాడుతూ.. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ అభిమానులను అన్ని ప్రాంతాల్లో గుర్తించి సత్కరించాలి అనుకుంటున్నాం. అలాగే మూడు దశాబ్దాలుగా కష్టపడి పనిచేసిన సీనియర్ అభిమానులు, ఆనాడు థియేటర్స్ దగ్గర కష్టపడినవాళ్లు, రికార్డుల కోసం పోరాడినవాళ్లు, థియేటర్స్ వద్ద కటౌట్స్ కట్టి, పూల దండలు వేసి, పాలాభిషేకాలు చేసి, సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు చాలా మంది సీనియర్ అభిమానులు ఉన్నారు. వారందర్ని గుర్తించే పనిలో ఉన్నాము.

ఈ పుట్టిన రోజున చిరంజీవి సీనియర్ అభిమానులను గుర్తించి వారందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అఖిల భారత చిరంజీవి సంఘం తరపున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మొదటగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది అని తెలిపారు. దీంతో సీనియర్ చిరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా హీరో అభిమానులకు ఇన్సూరెన్స్ చేయించడం చరిత్రలోనే మొదటిసారి అని పలువురు అభినందిస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజు నుంచే ఈ కార్యక్రమం మొదలుపెడతారని తెలుస్తుంది.