Chiranjeevi About Director Bobby Father: డైరెక్టర్ బాబీ తండ్రి మృతి.. నా వీరాభిమాని చనిపోయాడు అంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి

టాలీవుడ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర (బాబీ) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కొల్లి మోహనరావు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాబీ తండ్రి మరణించారన్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Chiranjeevi Emotional Words On Director Bobby Father's Death

Chiranjeevi About Director Bobby Father: టాలీవుడ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర (బాబీ) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కొల్లి మోహనరావు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఆయన 154వ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. బాబీ తండ్రి మరణించారన్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ బాబీ తండ్రి మోహనరావు తనకు వీరాభిమాని అని, ఎంతటి వీరాభిమాని అంటే బాబీ చిన్నప్పుడు స్కూలుకు వెళుతుంటే చిరంజీవి సినిమా రిలీజ్ మనం మొదటి రోజే చూడాలని చెప్పి, బాబీ తల్లికి కూడా తెలియకుండా సినిమా థియేటర్‌కు తీసుకువెళ్లి తన అభిమానాన్ని తన కొడుకుకు కూడా షేర్ చేశారని.. అలాంటి వీరాభిమాని మోహన్ రావు అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలోనే కాదు బాబీ నాతో సినిమా చేయక ముందే నేను ఆయనను కలిశానని, నా వీరాభిమాని విషయం తెలుసుకుని ఆయన ఆరోగ్యం బాగోకపోతే స్వయంగా వారి ఇంటికి వెళ్లి కలిశానని చిరంజీవి అన్నారు.

Director Bobby : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో విషాదం.. సంతాపం తెలుపుతున్న సినీ పెద్దలు..

ఇక బాబీ నాతో సినిమా చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని మెగాస్టార్ అన్నారు. నా అభిమాన హీరోతో నా కొడుకు డైరెక్టర్‌గా సినిమా చేస్తున్నాడు అంటే నా జన్మ ధన్యం అయినట్లే అంటూ చాలాసార్లు నాతో ఎగ్జయిట్ అవుతూ మాట్లాడారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత పలు సందర్భాలలో కలుస్తూనే ఉన్నాము, సినిమా ఎక్కడవరకు వచ్చిందనే విషయాన్ని ఆయన ప్రతిరోజు ఆసక్తిగా తెలుసుకుంటూనే ఉన్నారని మెగాస్టార్ అన్నారు. మూడు రోజులు ముందు కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయనని వెళ్లి పరామర్శించానని, అయితే అపస్మారక స్థితిలో ఉన్నా నేను మీ చిరంజీవిని వచ్చాను అని చెబితే ఆయన మాగన్నుగా కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నారని, అలా మూసుకున్న వ్యక్తి తిరిగి వస్తారని అనుకున్నాను. కానీ ఇలా కనుమూస్తారని అనుకోలేదని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన అనారోగ్యం విషయం తెలిసిన బాబీ ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిందే, కానీ నేను మీతో చేస్తున్న సినిమా పూర్తయి అది ఆయన చూసి గుంటూరులో తన స్నేహితులకు గర్వంగా ఇది నా కొడుకు, మా బాస్‌తో చేసిన సినిమా అని చెప్పుకుంటే చాలని.. ఆయన జనవరి వరకైనా బతికి ఉంటే చాలని అంటూ ఉండేవాడని, అలా జరగగలిగితే ఆయన జన్మ చరితార్థం అయినట్లే అని చాలా బలంగా కోరుకున్నాడు. కానీ అది ఏదీ జరగలేదని అన్నారు. ఇది చాలా దురదృష్టకరం అన్న చిరంజీవి, ఇలాంటి వీరాభిమానిని దూరం చేసుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. డైరెక్టర్ బాబీ అలాగే ఆయన కుటుంబానికి నేను నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. మోహన్ రావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.