ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి సమావేశం వాయిదా

  • Publish Date - October 11, 2019 / 05:04 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ సమావేశం వాయిదా పడింది. శుక్రవారం(11 అక్టోబర్ 2019) ఉదయం 11గంటలకు వీరిద్దరు భేటి కావలసి ఉండగా.. అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంతో చిరంజీవి, రాంచరణ్ భేటీ అవుతారని భావించినా చివరకు సమావేశం వాయిదా పడింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల సీయం జగన్ మరియు చిరంజీవి భేటీ అక్టోబర్ 14వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీంతో సోమవారం(అక్టోబర్ 14) ఉదయం వీరు భేటీ అయ్యే అవకాశం ఉంది. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కావాలని నిర్ణయించుకుని అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ సంధర్భంగా సైరా నరసింహారెడ్డి సినిమాని చూడాలని చిరంజీవి, రామ్ చరణ్ సీఎం జగన్ ని కోరనున్నారని సమాచారం.

అలాగే తెలుగు స్వాతంత్ర సమరయోధుని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తారని తెలుస్తుంది. అలాగే సినిమాకు ప్రభుత్వం తరపున పన్ను మినహాయింపు కోరాలని ఆలోచనగా తెలుస్తుంది. 

జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ పెద్దలెవరూ జగన్ ని కలిసింది లేదు. దీనిపై వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ కూడా అప్పట్లో సంచలన కామెంట్లు చేశారు. అప్పట్లో దిల్ రాజు, అశ్వినీదత్ వంటి నిర్మాతలు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింమెంట్ దొరకలేదు.