అర్జున్ సురవరం: చేగువేరా ఇమేజ్ చూడగానే ఎవరు గుర్తొచ్చారో తెలుసా?

అనేక ఆటంకాలు తర్వాత అర్జున్ సురవరం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. సినిమా ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించారు. వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా విచ్చేసి అభిమానుల్లో జోష్ నింపారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ సినిమాలో ఉన్న చేగువేరా పాటతో రోమాలు నిక్కబొడుచుకున్నాయని, పాటలో చేగువేరా ఇమేజ్ చూడగానే ఎవరు గుర్తొచ్చారో తెలుసా? అంటూ పవర్ స్టార్ మేనరిజమ్ అయిన మెడపై చేతితో రుద్దుతూ.. పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘రాజ్‌కుమార్ మొహమాటపడుతుంటే నేనే అడిగి ఈవెంట్ ఏర్పాటు చేయమన్నానని, కష్టాన్ని గుర్తించి సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తాను ఫంక్షన్‌కు వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. నిర్మాతగా మేమిచ్చిన అవకాశంతో ప్రయాణం మొదలుపెట్టిన ఠాగూర్ మధు ఉత్తమ నిర్మాతగా మరిన్ని సినిమాలు చేస్తాడని కోరుకుంటున్నానన్నారు. మురుగదాస్ దగ్గర కో డైరక్టర్‌గా పనిచేసిన సంతోష్ కుమార్ సినిమాను చక్కగా తీశారు’
‘హీరో నిఖిల్ సిద్దార్థ్ నాకు తమ్ముడులా ఫీలవుతున్నా. మరో శిష్యుడు దొరికాడనుకుంటున్నా. లవర్ బాయ్, చాక్లెట్ బాయ్‌గా ఉండే నిఖిల్ యాక్షన్ హీరోగా రాబోతున్నాడు. జర్నలిస్టుగా, చేగువేరాలా సినిమాలో కనిపించబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా సినిమా ఉంటుందని ఆశిస్తున్నా. సినిమా ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. టెక్నాలజీ చెడ్డదారిలో వెళ్తుందని, దాని కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుందని సినిమాలో బాగా చెప్పారు’ అని తన మాటల్లో చెప్పారు.
నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్ లేఖ రామన్ తదితరులు నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చారు.