Delhi High Court Dismisses Juhi Chawlas Plea On 5g Technology
Juhi Chawla : 5జీ టెక్నాలజీ సురక్షితం కాదంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేవలం పబ్లిసిటీ కోసమే జూహీ చావ్లా పిటీషన్ వేసారని…. కోర్టులను అపహస్యం పాలు చేసినందుకు ఆమెకు రూ. 20 లక్షలు జరిమానా విధించింది. ఆమెతో పాటు వీరేశ్ మాలిక్, టీనా వాచ్ఛానీ అనే మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు కూడా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ల పై విచారణ చేట్టిన ఢిల్లీ హైకోర్టు శుక్రవారం పిటిషన్లను కొట్టివేసింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కావాల్సిందేనని తేల్చి చెప్పింది.
జూహీ విదేశాల్లో ఉండటంతో కోర్టు విచారణకు ఆమె స్వయంగా హాజరు కాలేక పోవటంతో వర్చువల్ విధానంలో విచారణ జరిగింది. అయితే అంతకంటే ముందే ఆమె వర్చువల్ విచారణ లింక్ ను తన అభిమానులకు పంపించారు. జూహీ తరుఫు న్యాయవాది దీపక్ ఖోస్లా కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో, లింక్ పొందిన జూహీ అభిమాని ఒకరు సినిమా పాటలు పాడటంతో న్యాయమూర్తి చిరాకుపడ్డారు.
న్యాయమూర్తి పాటలు పాడొద్దని హెచ్చరించినప్పటికీ అతను మరోసారి పాట అందుకున్నాడు. ప్రొసీడింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కోర్టు ఆమెపై సీరియస్ అయింది. రూ.20లక్షల పెనాల్టీ వేసింది. పిటిషన్లో బలం లేదని, అనవసరంగా 5 వేల పేజీలతో దాఖలు చేశారని పేర్కొంది.
జూహీ పిటీషన్ అంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని, ఆమె పిటిషన్‌ను కొట్టేయాలని కేంద్రం, ఢిల్లీ హైకోర్టును కోరింది. కాగా… పిటీషన్ విచారణ జరుగుతున్నప్పుడు పాటలు పాడి కోర్టు ధిక్కారానికి పాల్పడిన జూహీ అభిమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.