Site icon 10TV Telugu

Kalinga : ‘కళింగ’ మూవీ రివ్యూ.. చూసి భయపడాల్సిందే..

Dhruva Vaayu Pragya Nayan Kalinga Movie Review and Rating

Dhruva Vaayu Pragya Nayan Kalinga Movie Review and Rating

Kalinga Movie Review : ధృవ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాణంలో ప్రగ్య నయన్ హీరోయిన్ గా నటించగా ఆడుకాలం నరేన్, సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని నిర్మించారు. కళింగ సినిమా నేడు సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. కళింగ రాజసంస్థానంలో మనుషులు తమ శరీర అవయవాలను వాళ్ళే కోసుకొని తింటూ ఉంటారు. అలాంటి ఊహించని పలు సంఘటనలు జరగడంతో రాజు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అడివిలోని ఓ ఊళ్ళో ఒకవైపు పొలిమేర దాటి అడివి లోపలికి ఎవరు వెళ్ళరు. అటు వెళ్లిన వాళ్ళు ఎవరు బతికి తిరిగిరాలేదు. లింగ(ధ్రువ వాయు) ఆ ఊళ్ళో తన ఫ్రెండ్(లక్ష్మణ్ మీసాల)తో కలిసి సారా అమ్ముకుంటూ బతుకుతుంటాడు. లింగ చిన్నప్పట్నుంచి అదే ఊళ్లోని పద్దు(ప్రగ్య నయన్)ని ప్రేమిస్తూ ఉంటాడు. ఊళ్ళో పటేల్ జనాల పొలాలు తాకట్టు పెట్టుకొని డబ్బులు తిరిగి కట్టినా వాళ్లకు పొలాలు తిరిగి ఇవ్వడు. ఎదిరిస్తే చంపేస్తాడు పటేల్, అతని తమ్ముడు.

లింగ, పద్దు పెళ్లి కావాలంటే పటేల్ దగ్గర ఉన్న లింగ పొలం విడిపించుకొమ్మని పద్దు నాన్న కండిషన్ పెడతాడు. అప్పటికే లింగకు, పటేల్ తమ్ముడికి గొడవలు ఉంటాయి. లింగ వెళ్లి పొలం అడగడంతో అతని రెండెకరాల పొలం బదులు అడవిలో నాలుగెకరాల పొలం ఇస్తాను అని పొలిమేర వైపు ఉన్న పొలం ఇస్తాడు పటేల్. లింగ చిన్నప్పట్నుంచి అడవిలోకి వెళ్లి వస్తూ ఉన్నా అతనికి ఏం కాదు. దీంతో లింగ, అతని ఫ్రెండ్ ఆ పొలం కోసం పొలిమేర దాటి అడివిలోకి వెళ్తారు. అలా వెళ్లిన ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చారా? లింగ పెళ్లి జరిగిందా? అసలు అడివిలో ఏం జరుగుతుంది? రాజసంస్థానంలో ఎందుకు మనుషులు అలా మారుతున్నారు? రాజసంస్థానానికి ప్రస్తుతం అడివికి సంబంధం ఏంటి? అసలు కళింగ రాజుల కథేంటి? లింగ అడవిలోకి దేని కోసం వెళ్ళేవాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Bhale Unnade : ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ భలే నవ్వించి ఎమోషనల్ చేశాడే..

సినిమా విశ్లేషణ.. ఇటీవల రాజుల కాలం, దేవుడు, రాక్షసుడు కథలను పాయింట్స్ గా తీసుకొని సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అదే కోవలోకి చెందింది. కళింగ సినిమా ఒక నిధి వేట కథని హారర్ జానర్ లో డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేసారు. అయితే సినిమా మొదట్లో, సెకండ్ హాఫ్ కాసేపు ఆల్మోస్ట్ 10 నిమిషాల పైన వాయిస్ ఓవర్ తోనే కథలోని కీలక అంశాలు చెప్పే ప్రయత్నం చేసారు.

ఫస్ట్ హాఫ్ అంతా పొలిమేర చూపించి భయపెడుతూనే హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని బాగానే భయపెట్టారు. దీంతో అసలు పొలిమేర అవతల అడివిలో ఏముంది అని ఆసక్తి నెలకొంటుంది. అలాగే రాజసంస్థానం కథ ఏమైంది అని ఆసక్తి నెలకొంటుంది. వీటన్నిటికీ సెకండ్ హాఫ్ లో సమాధానాలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులని భయపెట్టే స్కోప్ ఉన్నా ఉపయోగించుకోలేకపోయారు. సెకండ్ హాఫ్ లో అసలు కథని ఎక్కువగా నేరేషన్ లోనే చెప్పేయడంతో బోలెడు సందేహాలు వస్తాయి. ఇక క్లైమాక్స్ లో అమ్మవారు వచ్చినట్టు వేసే గ్రాఫిక్ సీన్స్, దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి హై ఫీల్ ఇస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ధ్రువ వాయు పర్వాలేదనిపించాడు. కానీ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే బాగా సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది. ప్రగ్య నయన్ కేవలం ప్రేమ కథకు మాత్రమే. తన అందం, నటనతో మెప్పించింది. ఆడుకాలం నరేన్, సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్, అబ్దుల్ రషీద్.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మేపించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. మంగళవారం సినిమా రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులని భయపెట్టడానికి కొన్ని కొత్త కొత్త షాట్స్ తీశారు. కొన్ని చోట్ల డబ్బింగ్ కరెక్ట్ గా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. పాటలు యావరేజ్. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అడవిలో ఊరు సెట్, అడవిలో భయపెట్టడానికి సెటప్స్ అన్ని బాగా డిజైన్ చేసారు. ధ్రువ వాయు మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. పాత కథని, కొత్తగా చూపించాడు. చిన్న సినిమా అయినా నిర్మాణ పరంగా కథకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారని తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘కళింగ’ సినిమా ఓ నిధి వేట కోసం వెళ్లే హీరో, అసలు ఆ నిధి చరిత్ర ఏంటి, కళింగ రాజ్యం కథేంటి అని హారర్ ఎలిమెంట్స్ తో డివోషనల్ టచ్ తో చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

Exit mobile version