అల్లు అర్జున్‌ను కలిసేందుకు అభిమాని పాదయాత్ర.. ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలుసా!..

  • Publish Date - September 23, 2020 / 08:47 PM IST

Allu Arjun Die Hard Fan Padayatra: సినిమా హీరోల పట్ల అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుదనేది మాటల్లో చెప్పలేం. తమ అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని కలలు కంటుంటారు. ఇక తమ హీరోల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఫ్యాన్స్‌కి చెప్పలేని ఆనందం. ఇప్పుడు ఓ అభిమాని తన అభిమాన నటుణ్ణి కలవాలని పాదయాత్ర చేపట్టి వార్తల్లో నిలిచాడు.

గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వీరాభిమాని. ఎలాగైనా అల్లు అర్జున్‌ని కలవాలని సెప్టెంబర్‌ 17వ తేదీన ఆయన మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మొదలుపెట్టాడు.


అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమా నుంచి ఆయనకు వీరాభిమానిని అని చెబుతున్న నాగేశ్వరరావు.. ఇప్పటికే నాలుగైదు సార్లు బన్నీని కలిసేందుకు ప్రయత్నించాడట. ఈసారి మాత్రం బన్నీని కలవకుండా మాచర్ల తిరిగివెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నాడు.

బన్నీని కలిసి ఒక ఫొటో దిగి, రెండు నిమిషాలు మాట్లాడి గానీ మాచర్ల వెళ్లనని నాగేశ్వరరావు అంటున్నాడు. కరోనా టైమ్‌లో కూడా తమ అభిమాన హీరోను కలవడానికి ఇంతటి సాహసం చేసిన నాగేశ్వరరావు కోరిక తీరాలని, అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యే వరకు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తాం అంటూ బన్నీ ఫ్యాన్స్ అందరూ నాగేశ్వరరావు వీడియోను వైరల్ చేస్తున్నారు.