బాక్సాఫీస్ వద్ద క్రిడాకారుల బయోపిక్స్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. ‘భాగ్ మిల్కా భాగ్ (2013), మేరీకోమ్ (2014), దంగల్ (2016)’ వంటి సినిమాలు బాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లు రాబట్టాయి. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ పేరుతో తెరకెక్కుతోంది. మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్స్‌పై ప్రకటనలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా అథ్లెట్ ద్యుతీ చంద్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతుంది బాలీవుడ్. ఈ చిత్రానికి జాతీయ అవార్డుగ్రహీత హిమాన్షు ఖతువా దర్శకత్వం వహిస్తారు.
ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం గోపాల్ పూర్ ద్యుతీచంద్ స్వస్థలం. చాలా పేద కుటుంబం. తల్లి, తండ్రి ఇద్దరూ చేనేత పని చేసేవారు. ఇద్దరూ కలిసి పనిచేసినా నెలకు రెండువేల రూపాయలు రాని పరిస్థితి. కుటుంబంలో ఏడుగురు పిల్లలు. వారినెలా పోషించాలో తెలియదు. చిన్న మట్టి గుడిసెలో ఉండేవారు. టాయిలెట్ సౌకర్యం కూడా లేని ఆమె కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయం. అటువంటి ద్యుతీకి నాలుగేళ్ల వయసులో పరుగంటే ఏంటో తెలిసింది. ఆమె అక్క సరస్వతికి పరుగు పందేల్లో పాల్గొనడం ఇష్టం. ప్రాక్టీస్ కోసం ఎవరూ తోడు లేరు. కాబట్టి తనకన్నా పదేళ్లు చిన్నదయిన తన చెల్లి ద్యుతీని తోడు తీసుకెళ్తుంటుంది. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో, ఇసుకలో, మట్టిరోడ్లపై పరుగు తీసేది.
ఇలా ఎన్నో సంఘర్షణల అనంతరం.. మూడేళ్లు అక్క శిక్షణలో రాటుదేలిన తర్వాత ద్యుతీకి 2006లో ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో అవకాశం వచ్చింది. ద్యుతీచంద్ 16 ఏళ్ల వయసులో అండర్-18 విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. తర్వాతి రెండేళ్లలో ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100మీ. 200మీ. విభాగాల్లోనూ స్వర్ణం గెలిచింది. జీవితం తాను కోరుకున్నట్లే సాగుతోంది. కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగింది. అయితే అంతలో ఆమె జీవితంలో అనుకోని ట్విస్ట్ వచ్చింది. ఆమె శరీరంలో పురుష హార్మోన్లు స్థాయికి మించి ఉన్నాయని భారత అధ్లెటిక్ సమాఖ్య ద్యుతిపై నిషేధం విధించింది. ఈ నిషేధంపై రెండేళ్ళు పోరాడి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది.
ద్యుతి చంద్ జీవితంలో ఎన్నో ట్రాజెడీలు, ట్విస్ట్ లు, విజయాలు ఉన్నాయి. బయోపిక్‌కి అవసరమైన ఎంతో డ్రామా ఆమె జీవితంలో ఉండడంతో ఆమె బయోపిక్ తీసేందుకు ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ట్రై చేశాయి. కానీ, చివరకు హిమాన్షుకి అవకాశం ఇచ్చింది ద్యుతీ చంద్. ఇప్పటికే ఫస్ట్ డ్రాఫ్ట్ స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ద్యుతీ చంద్ ఆటతోనే కాదు తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచారు. సమీప బంధువైన టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయాన్ని ప్రకటించి అప్పట్లో సంచలనం సృష్టించింది.