Pawan Kalyan: గబ్బర్ సింగ్ మళ్ళీ రిలీజ్.. థియేటర్లలోనే బర్త్‌డే వేడుకలు!

పవర్ స్టార్ అభిమానులకు త్వరలోనే పండగ రానుంది. సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు నిజమైన పండగ. ఆ మాటకొస్తే పవన్ కు అభిమానులే కాదు భక్తులు కూడా ఉండగా అందులో నటుడు, నిర్మాత బండ్ల గణేష్..

Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు త్వరలోనే పండగ రానుంది. సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు నిజమైన పండగ. ఆ మాటకొస్తే పవన్ కు అభిమానులే కాదు భక్తులు కూడా ఉండగా అందులో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక భక్తుడు. ఈ మాట ఆయనే పలుమార్లు ఆ విషయాన్ని చెప్తూ పవన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. కాగా, ఇప్పుడు మరోసారి తన భక్తిని చాటుకుంటున్నాడు బండ్ల గణేష్. గణేష్ నిర్మించిన పవన్ సినిమా గబ్బర్ సింగ్ విజయం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రీమేక్ గానే వచ్చిన ఈ సినిమా పవన్ కు బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

కాగా, ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ విడుదల చేయనున్నారట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన బండ్ల గణేష్.. సెప్టెంబర్ రెండో తారీఖున బాస్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర అని బండ్ల‌ గణేష్ చెప్పుకొచ్చారు.

అయితే ప‌వ‌న్ అభిమానులు మా ఊరిలో కూడా ప్ర‌ద‌ర్శించండి అని గ‌ణేష్‌కి వ‌రుస ట్వీట్స్ చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న స్పందిస్తూ.. దయచేసి మీరందరూ మీ ఊర్లో థియేటర్ బుక్ చేసుకొండి. షోకి నేను పర్మిషన్ ఇస్తాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కరోనా భయం నుండి బయటపడని సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో థియేటర్లు ఖాళీగా ఉండగా ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాతో ఎంతోకొంత మళ్ళీ ఊరట లభించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాగా, చాలారోజులుగా పవన్ తో మరో సినిమాకి ప్రయత్నిస్తున్న బండ్ల కోరిక కూడా త్వరలోనే తీరనున్నట్లుగా తెలుస్తుంది.