Sunny Deol
Gadar -2 movie : సన్నీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం గదర్ -2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సన్నీ డియోల్ ఇండియా – పాకిస్థాన్ మధ్య సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నటుడు, బీజేపీ ఎంపీ బుధవారం గదర్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం, పాకిస్థాన్ దేశాల ప్రజలు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారు శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. అయితే, ఇరుదేశాల ప్రజల నుంచి సమానమైన ప్రేమ ఉన్నప్పటికీ.. రాజకీయ క్రీడలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వేషానికి కారణమంటూ సన్నీ డియోల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సన్నీ డియోల్ వ్యాఖ్యలపట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Bro Movie : మొన్నటిదాకా హైప్ లేదు.. పవన్ ఎంట్రీతో ‘బ్రో’పై పెరిగిన అంచనాలు.. రేపే రిలీజ్..
సన్నీ డియోల్ వ్యాఖ్యలపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఓ నెటిజన్.. పాకిస్థాన్‌లోని ప్రజలు గదర్ -2ని చూస్తారు కాబట్టి అతను ఈ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు. మరికొందరు సన్నీ ప్రకటన కారణంగా సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ -2లో సన్నీ డియోల్, అమీషా పటేల్ తారా సింగ్, సకీనా పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. గదర్ -2ని అనిల్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. గదర్-2 సినిమా.. గదర్ ఏక్ ప్రేమ్ కథ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుంది. ఇదిలాఉంటే.. ఈ చిత్రం ట్రైలర్‌లో తారా సింగ్, సకీనాలకు కొడుకు జీతే (ఉత్కర్ష్) ఒక పాకిస్థానీ ఆర్మీ జనరల్ చేత హింసించబడటం ట్రైలర్‌లో కనిపిస్తుంది. తారా సింగ్ వేదనతో ఉన్న సకీనాకు జీతేని తిరిగి తీసుకొస్తానని హామీ ఇస్తాడు. ఈ క్రమంలో అతను లాహోర్‌ని సందర్శించి, పాకిస్థానీ సైనికులను చితక్కొడతాడు. ఆ తరువాత పోరాట సన్నివేశాలు ఉంటాయి. చివరికి.. తారా సింగ్ చేతి పంపును చూస్తూ ఉండటంతో ట్రైలర్ ముగుస్తుంది.