Raju Yadav : ‘రాజు యాదవ్’ మూవీ రివ్యూ.. గెటప్ శ్రీను హీరోగా హిట్ కొట్టాడా?

గెటప్ శ్రీను ఇప్పుడు హీరోలాగా రాజు యాదవ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Raju Yadav Movie Review : జబర్దస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న గెటప్ శ్రీను తన కామెడీతో, తన గెటప్స్ తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్న గెటప్ శ్రీను నేడు మే 24న హీరోలాగా రాజు యాదవ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృష్ణమాచారి దర్శకత్వంలో గెటప్ శ్రీను, అంకిత ఖారత్ జంటగా ‘రాజు యాదవ్’ సినిమా తెరకెక్కింది. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

కథ విషయానికొస్తే.. రాజు(గెటప్ శ్రీను) డిగ్రీ ఫెయిల్ అయి ఊళ్ళో ఖాళీగా ఉంటాడు. ఓ రోజు క్రికెట్ ఆడుతుంటే బాల్ ఫేస్ కి తగిలి దెబ్బ తగిలి హాస్పిటల్ కి వెళ్తే కుట్లు వేయడంతో ఫేస్ నవ్వుతూ ఉండేలా మారిపోతుంది. ఆపరేషన్ చేయకపోతే ఫేస్ ఎప్పటికి అలాగే నవ్వుతూ ఉండిపోతుంది అని డాక్టర్లు చెప్తారు. ఆపరేషన్ కి 4 లక్షలు అవుతాయి కానీ అంత డబ్బు లేకపోవడంతో అలాగే ఉండిపోతాడు రాజు. ఓ రోజు తన ఫ్రెండ్ పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ స్వీటీ(అంకిత ఖారత్)ని చూసి ప్రేమలో పడతాడు. స్వీటీ అక్కడే ఊళ్ళో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఉంటుంది. రాజు నవ్వుతూ స్వీటీ వెంట పడుతుండటంతో మొదట సీరియస్ అవుతుంది. కానీ తన ప్రాబ్లమ్ చెప్పాక కూల్ అయి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. స్వీటీకి హైదరాబాద్ లో జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయి, తన గురించి ఆలోచించకు అని చెప్తుంది రాజుకి. స్వీటీ హైదరాబాద్ వెళ్లిపోవడంతో రాజు కూడా హైదరాబాద్ వెళ్తాడు. మరి రాజు హైదరాబాద్ వెళ్లి స్వీటీని కలిశాడా? రాజు హైదరాబాద్ వెళ్లి ఏం చేశాడు? స్వీటీతో ప్రేమ ఏమైంది? రాజు ఆపరేషన్ చేయించుకున్నాడా? రాజుకి అతని నవ్వు వల్ల వచ్చిన సమస్యలు ఏంటి? రాజు పేరెంట్స్ కష్టాలు ఏంటి? స్వీటీ హైదరాబాద్ కి వెళ్లి ఏం చేస్తుంది అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Vijay Deverakonda : వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

సినిమా విశ్లేషణ.. అమ్మాయిని ప్రేమించి అమ్మాయి చుట్టూ తిరిగే అబ్బాయిల కథలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ప్రేమిస్తే, బేబీ, RX100, తాజ్ మహల్.. లాంటి పలు సినిమాలు గుర్తొస్తాయి రాజు యాదవ్ చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ అంతా రాజు ఆ అమ్మాయి వెనక పడటం, రాజు నవ్వుతో వచ్చే సమస్యలు.. ఇలా కామెడీతో పాటు లవ్ ని కూడా చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్ రాజు హైదరాబాద్ కి వచ్చాక ఏం జరిగింది అనేది చూపిస్తారు. కథ పరంగా చాలా పాత కథే అయినా హీరోకు నవ్వుతూ ఉండే సమస్య పెట్టి కొత్తగా చూపించడానికి ట్రై చేసాడు దర్శకుడు. కానీ కథ, కథనం మాత్రం రెగ్యులర్ గానే ఉంటుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం అంత కన్విన్స్ గా చూపించలేకపోయారు దర్శకుడు. సినిమాలో మంచి కామెడీతో పాటు ఎమోషన్ ని పండించగలిగారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. గెటప్ శ్రీను ఆల్రెడీ రకరకాల గెటప్స్ తో బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులని మెప్పించాడు. మొదటిసారి హీరోగా రాజు పాత్రలో గెటప్ శ్రీను అదరగొట్టాడు అని చెప్పొచ్చు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా ఫేస్ పెట్టి ఎమోషనల్ అయ్యే సీన్స్ లో, రొమాన్స్ సీన్స్ లో కూడా నవ్వుతూ అదరగొట్టాడు. కొన్ని సీన్స్ లో గెటప్ శ్రీను ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. ఇక ముంబై అమ్మాయి అంకిత ఖారత్ మోడ్రన్ అమ్మయిగా బాగా నటించింది. తన అందంతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన ఫ్రెండ్స్, పేరెంట్స్ పాత్రల్లో నటించిన వారు కూడా మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాని చాలా వరకు లోకల్ బస్తీల్లో, రియల్ లొకేషన్స్ లో తీశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా దానికి తగ్గట్టు సహజంగా ఉన్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలకు మంచి సంగీతం ఇచ్చారు. పాటలు బాగున్నాయి. లిరిక్స్ కూడా అర్థవంతంగా రాసారు. సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇచ్చిన మ్యూజిక్ తో ప్రేక్షకులు కూడా ఎమోషన్ అవుతారు. కథ, కథనం మాత్రం పాతదే. దర్శకుడిగా మాత్రం కృష్ణమాచారి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

మొత్తంగా ‘రాజు యాదవ్’ నవ్వుతూ ఉండే సమస్య ఉన్న ఓ అబ్బాయి సిన్సియర్ గా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కున్నాడు అనేది కామెడీ ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు