Bhimaa Review : ‘భీమా’ మూవీ రివ్యూ.. గోపీచంద్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడా?

భీమా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కి, ఆత్మలు అనే ఫాంటసీ ఎలిమెంట్స్ ని జతచేర్చి తెరకెక్కించారు.

Gopchand Bhimaa Movie Review and Rating

Bhimaa Review : గోపీచంద్(Gopichand) డ్యూయల్ రోల్ లో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘భీమా'(Bhimaa). ట్రైలర్స్ తో మంచి మాస్ తో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అని అంచనాలు పెంచింది భీమా. నేడు మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్స్ లో విడుదల అయింది.

కథ విషయానికొస్తే..
పరశురాముడు తన గండ్రగొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి ఏర్పాటుచేసిన భూమి మహేంద్రగిరి అనే ఊరిగా మారి అక్కడ పరమశివుడి ఆలయం ఏర్పడుతుంది. ఆలయంలో కూర్చుని పూజలు చేస్తే ఇంకా పైలోకానికి వెళ్లకుండా కోరికలతో ఉన్న ఆత్మలు వారి వంశస్థులని ఆవహించి ఆ కోరికను తీర్చుకుంటాయి. ఈ గుడి గురించి, ఆ ఊరు గురించి చెప్పి కథలోకి వెళతారు. ఆ మహేంద్రగిరిలో భవాని(ముకేశ్ తివారి) అనే ఒక విలన్ ఉంటాడు. అతని వ్యాపారాలకి అడ్డు వచ్చిన వాళ్ళని చంపేస్తాడు. అలా ఓ పోలీసుని చంపితే అతని ప్లేస్ లోకి వేరే ఊరి నుంచి ట్రాన్ఫర్ అయిన పవర్ ఫుల్ పోలీసాఫీసర్ భీమా వస్తాడు. రావడంతోనే భవాని ఇంటికి వెళ్ళిపోయి వార్నింగ్ ఇచ్చి నెలరోజులు టైం ఇస్తాడు లొంగిపొమ్మని. ఆ తర్వాత పోలీసాఫీసర్ గా ఊళ్ళో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ విద్య అనే టీచర్(మాళవిక శర్మ) తో ప్రేమలో పడతాడు. భవాని మనుషులు అనాధ పిల్లలని అక్రమంగా తరలిస్తుండగా యాక్సిడెంట్ అవ్వడంతో ఈ విషయం భీమాకు తెలుస్తుంది. ఆ పిల్లలని కాపాడుతుండగా భవాని మనుషులు భీమా మీద అటాక్ చేసి కొట్టి సముద్రంలో పడేస్తారు.

తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో సెకండ్ హాఫ్ లీడ్ ఇస్తాడు. సెకండ్ హాఫ్ లో అచ్చం భీమా లాగే ఉండే అతని తమ్ముడు రామ(గోపీచంద్) అనే ఓ అమాయక బ్రాహ్మణుడిని చూపిస్తారు. అసలు అన్నదమ్ములు ఎందుకు విడిపోయారు? భీమా బతికొచ్చాడా? విలన్ ఆగడాలు ఎలా అరికట్టారు? ఆ గుడి కథేంటి? ఆ పిల్లలని అక్రమంగా ఎక్కడికి తరలిస్తున్నారు? రామ స్టోరీ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
డ్యూయల్ రోల్ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు పవర్ ఫుల్ గా, ఇంకొకరు అమాయకంగా ఉండి ఒకరు చనిపోతే ఇంకొకరు రివెంజ్ తీర్చుకునే మాములు కమర్షియల్ కథకి శివుడు, ఆత్మలు, పరుశురాముడు, గుడి.. అంటూ కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ జతచేసారు. దీంతో కథకి కొత్తదనం ఏర్పడినా కథనం మాత్రం అదే రొటీన్ కమర్షియల్ సినిమాల్లానే సాగింది. ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ, హీరోయిన్ తో ప్రేమ, ఊళ్ళో ఒక సమస్య, దాన్ని హీరో ఎదుర్కోవడం అంటూ చూపించి సెకండ్ హాఫ్ లో అన్నదమ్ముల కథ, ఓ ట్విస్ట్ తో, ఆత్మలు, గుడి కథతో ఆసక్తిగా మార్చారు. సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నా అంతగా వర్కౌట్ అవ్వలేదు.

Also Read : Gaami Review : ‘గామి’ సినిమా రివ్యూ.. అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రం..

నటీనటుల విషయానికొస్తే..
గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా, అమాయక బ్రాహ్మణుడిగా రెండు పాత్రల్లో తన బెస్ట్ ఇచ్చాడు. మాళవిక శర్మ తన అందాలతోనే మెప్పించింది. ప్రియభవానీశంకర్ కాసేపే కనిపిస్తుంది. ఓ ముఖ్య పాత్రలో నాజర్ అదరగొట్టారు. నరేష్ కాసేపు నవ్విస్తారు. రఘుబాబు, సరయు, ముకేశ్ తివారి.. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు..
ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. సాంగ్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ లో VFX ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పాత కమర్షియల్ కథకి కొత్తదనం జోడించినా, స్క్రీన్ ప్లే మాత్రం మాటి మాటికి ఫ్లాష్ బ్యాక్ లోకి, ముందుకి తీసుకొచ్చారు. అయితే కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో మాత్రం దర్శకుడు సక్సెస్ అయినా కథనాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్ గా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.

మొత్తంగా భీమా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కి, ఆత్మలు అనే ఫాంటసీ ఎలిమెంట్స్ ని జతచేర్చి తెరకెక్కించారు. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు థియేటర్ కి వెళ్లాల్సిందే. ఈ సినిమాకి రేటింగ్ 2.75 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు