Gaami Review : ‘గామి’ సినిమా రివ్యూ.. అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రం..

అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన విశ్వక్ సేన్ 'గామి' సినిమా రివ్యూ ఏంటి..?

Gaami Review : ‘గామి’ సినిమా రివ్యూ.. అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రం..

Vishwak Sen Chandini Chowdary Gaami Movie Detailed Review And rating

Gaami Review : విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద, మొహమ్మద్ సమద్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ అండ్ టీజర్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. నేడు శివరాత్రి సందర్భంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంది.

కథ విషయానికొస్తే.. శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా, అతనికి గతం కూడా గుర్తుండదు. అతనికి మనిషి స్పర్శ తగలకూడదు. తగిలితే ప్రాణం పోయినట్టు అవుతుంది. కొన్నాళ్లుగా ఆశ్రయం ఇచ్చిన అఘోరా ఆశ్రమం శంకర్ వల్ల తమకు చెడు అని అతన్ని పంపించేస్తారు. దీంతో అతన్ని ఆశ్రమంలో జాయిన్ చేసిన కేదారి బాబాని వెతుక్కుంటూ కుంభమేళాకు వెళ్తాడు. బాబా చనిపోయినా ఇతని జబ్బు పోగొట్టే మాలపత్రాలు హిమాలయాల్లో ఓ చోట దొరుకుతాయని మ్యాప్ అతని శిష్యుడు ఇస్తాడు. అదే మాల పత్రాల కోసం జాహ్నవి (చాందిని చౌదరి) కూడా ఇతనితో కలిసి హిమాలయాలకు బయలుదేరుతుంది. మరోవైపు ఓ ఊళ్లో దుర్గా (అభినయ) అనే దేవదాసి, తన కూతురు ఉమా (హారిక పెద్ద) కథ నడుస్తుంది. దుర్గకి హెల్త్ బాగోకపోవడంతో ఆమెని దేవదాసిగా తప్పించి ఉమాని పెట్టాలనుకుంటారు. మరోవైపు హిమాలయాల్లో ఎక్కడో బయటకు కూడా రాలేని ఓ కర్మగారంలో డాక్టర్ భక్షి మనుషుల మీద, వారి మెదడుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అక్కడ CT-333 అనే ఓ వ్యక్తి (మొహమ్మద్ సమద్) తప్పించుకొని వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

మరి శంకర్ కి, జాహ్నవికి ఆ మాల పత్రాలు దొరికాయా? ఉమా దేవదాసి వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంది? ఆ డాక్టర్స్ నుంచి ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? అసలు వీరు ముగ్గురికి లింక్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also read : Premalu Review : ‘ప్రేమలు’ మూవీ రివ్యూ.. సింగిల్ బాయ్స్ కచ్చితంగా చూడాల్సిందే..

సినిమా విశ్లేషణ.. హీరో ప్రమోషన్స్ లో చెప్పినట్టు ఇది కమర్షియల్ సినిమా కాదు. పూర్తిగా ఒక ప్రయోగం. ఫస్టాఫ్ అంతా శంకర్, ఉమా ఆ బంధించిన వ్యక్తి కథలు నడిపిస్తారు. శంకర్, జాహ్నవి హిమాలయాల్లో మాల పత్రాల కోసం వెతకడం, ఉమా తల్లి దుర్గ దేవదాసి కథ, ఆ బంధించిన వ్యక్తి బయటికి వెళ్లాలి అనే ప్రయత్నాలు చూపిస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా బాగా ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ని హైరేంజ్ లో ప్లాన్ చేసుకునే స్కోప్ ఉన్నా కూడా దర్శకుడు మరెందుకు సింపుల్ గా ఇచ్చేశాడు. ఇక సెకండ్ హాఫ్ అంతా హిమాలయాల్లో మాల పత్రాల కోసం శంకర్ చేసే సాహసాలు, ఉమా తప్పించుకొని వెళ్లడం, ఆ కారాగారంలో వ్యక్తి డాక్టర్స్ నుంచి తప్పించుకొని వెళ్లడం చూపిస్తారు. ఈ సీన్స్ అన్ని చాలా ఆసక్తిగా సాగుతాయి. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది కానీ సినిమాలను రెగ్యులర్ గా చూసేవాళ్ళు ఖచ్చితంగా క్లైమాక్స్ ని అంచనా వేయగలరు.

అయితే ఇది పూర్తిగా ఒక ప్రయోగాత్మక చిత్రం. కమర్షియల్ అంశాలు లేకపోయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్ సీన్స్ ఉంటాయి. యాంథాలజీ కథల్లా చూపించిన మూడు కథలకి క్లైమాక్స్ లో కనెక్షన్ ఇచ్చి సినిమాకి మంచి ఎండింగ్ ఇచ్చారు. విజువల్స్ గ్రాఫిక్స్ పరంగా గామి అద్భుతమైన సినిమా.

నటీనటుల విషయానికొస్తే.. విశ్వక్సేన్, చాందిని చౌదరి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు అని చెప్పొచ్చు. చాలా సీన్స్ నిజంగానే హిమాలయాల్లో తీశారు. ప్రమోషన్స్ లో కూడా విశ్వక్, చాందిని హిమాలయాల్లో లైఫ్ రిస్క్ పెట్టి మరి ఈ సినిమా చేశామని చెప్పారు. అది తెరపై చాలా క్లియర్ గా కనిపిస్తుంది హిమాలయాల్లో విశ్వక్, చాందిని చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా కోసం వారిద్దరూ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. హిమాలయాల్లో ఈ రేంజ్ సాహసాలు సినిమా కోసం మన ఇండియన్ కమర్షియల్ హీరోయిన్స్ అయితే చేయరేమో. కానీ చాందిని చౌదరి చాలా సీన్స్ లో రిస్క్ తీసుకొని మరి అద్భుతంగా నటించింది.

ఉమాగా చైల్డ్ ఆర్టిస్ట్ హారిక మెప్పిస్తుంది. దేవదాసి దుర్గగా అభినయ మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రయోగాల జైలు నుంచి తప్పించుకునే వ్యక్తిగా మహమ్మద్ సమద్ బాగా నటించాడు. డాక్టర్ బక్షిగా మయాంక్ పరాక్ నెగిటివ్ షేడ్స్ లో మెప్పిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా చక్కగా నటించారు.

సాంకేతిక అంశాలు.. గామి సినిమాకు విఎఫ్ఎక్స్ ప్రాణం పోశాయి. సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని షాట్స్ అయితే వావ్ అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ఫెక్ట్ గా సెట్ అయింది. పాటలు చాలా బాగుంటాయి. సినిమా కథ, కథనం దర్శకుడు చాలా పక్కాగా రాసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డట్టు డైరెక్టర్ విద్యాధర్ ప్రమోషన్స్ లో తెలిపాడు. ఆ కష్టం సినిమాలో కనిపిస్తుంది. సినిమా మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టినా వెంటనే ఆసక్తికర సీన్స్ వచ్చి సినిమాని ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. దర్శకుడిగా విద్యాధర్ 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు

మొత్తంగా గామి సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రం. కొత్త కొత్త కథలు చూడాలనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి వెళ్లే వాళ్లకి ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. గామి సినిమాకు 3 రేటింగ్ ఇవ్వచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.