చెన్నై : ఐటీ దాడులతో శాండల్‌వుడ్ షేక్ అవుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సోదాల్లో భారీ ఎత్తున ఆస్తులు, బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేశారన్న అనుమానాలతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కన్నడ సినీ తారలు, నిర్మాతల ఇళ్లపై జరిగిన ఐటీ దాడుల్లో భారీగా అక్రమ సొమ్ము పట్టుబడింది. వరుసగా మూడు రోజులపాటు ఈ సోదాలు జరిగాయి. ఇందులో ఏకంగా రూ. 109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, 25 కేజీల బంగారం పట్టుబడింది.
జనవరి 10 నుండి దాడులు…
ప్రముఖ హీరోలు శివరాజ్‌కుమార్, ఆయన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తాజా హిట్ మూవీ కేజీఎఫ్ హీరో యశ్, మరో సీనియర్ హీరో కిచ్చ సుదీప్‌ల నివాసాలు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు జనవరి 10వ తేదీ నుండి ఉదయం నుంచే దాడులు చేపట్టారు. శాండల్‌వుడ్ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు, డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం, వాటి కలెక్షన్‌లు, పన్ను ఎగవేత అనుమానాల వల్లే ఐటీ అధికారులు సోదాలకు పాల్పడినట్లు శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు.
ఐటీ దాడులతో శాండల్ వుడ్ షేక్…
ఇక 180 కార్యాలయాలు, 21 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ అధికారులు నటులు, నిర్మాతల అక్రమ నగదు, పెట్టుబడులు, బంగారు ఆభరణాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. కన్నడ సినీ తారలు, నిర్మాతలు ఎవరెవరి ఇంట్లో ఎంతెంత మొత్తం స్వాదీనం చేసుకున్నారో ఇంకా ఐటీ శాఖ అధికారులు వెల్లడించలేదు. మొత్తానికి ఐటీ శాఖ అధికారుల తనిఖీలతో శాండల్‌వుడ్ మొత్తం షేక్ అవుతోంది.