Jabardasth comedian Santhi Kumar turned as director
Jabardasth Santhi Kumar : జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. కమెడియన్స్, రైటర్స్, టెక్నీషియన్స్.. ఇలా ఇక్కడ కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు స్టార్స్ హోదాలో ఉన్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా, రైటర్ గా మెప్పించిన పలువురు ఇప్పుడు దర్శకులుగా మారుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నారు.
మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శాంతి కుమార్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం టీంలీడర్ గా కూడా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమా చేస్తున్నారు జబర్దస్త్ శాంతి కుమార్. సాయి కుమార్, ఆదిత్య ఓం ముఖ్యపాత్రల్లో ‘నాతో నేను’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు శాంతి కుమార్. ఎమోషనల్ కథతో ఈ సినిమా ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కొన్ని పాటలు, దర్శకత్వం అన్ని శాంతి కుమార్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని ఆది సాయికుమార్ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ శాంతి కుమార్ మాట్లాడుతూ.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా మారాను. ఇది నా తొలిప్రయాణం. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు అన్ని నేనే రాసుకొని కొత్త నిర్మాతల సహకారంతో సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.