Vedaa : ‘వేద’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే..?

జాన్ అబ్రహం బాలీవుడ్ సినిమా 'వేద' నేడు ఆగస్టు 15న హిందీ, తెలుగు, తమిళ్ లో రిలీజయింది.

John Abraham Sharvari Bollywood Movie Vedaa Review and Rating

Vedaa : జాన్ అబ్రహం, శార్వరి, తమన్నా, అభిషేక్ బెనర్జీ.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘వేద’. జాన్ అబ్రహం, జీ స్టుడియోస్ నిర్మాణంలో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన వేద సినిమా నేడు ఆగస్టు 15న హిందీ, తెలుగు, తమిళ్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఆర్మీలో పనిచేసే మేజర్ అభిమన్యు(జాన్ అబ్రహం) భార్య(తమన్నా)ని టెర్రరిస్టులు చంపేయడంతో ఆమెని చంపిన వాళ్ళని వెతికి దారుణంగా చంపేస్తాడు. ఈ క్రమంలో పై అధికారుల మాటలు ధిక్కరించినందుకు అతన్ని సస్పెండ్ చేస్తారు. దీంతో తన భార్య ఊరు బర్మార్ వెళ్లి అక్కడ ఓ కాలేజీలో బాక్సింగ్ కోచ్ గా జాయిన్ అవుతాడు. బర్మార్ ఆ చుట్టూ పక్కల 150 ఊళ్ళకి పెద్దగా జితేందర్ ప్రతాప్ సింగ్(అభిషేక్ బెనర్జీ) ఉంటాడు. ఊళ్ళో ఆ కుటుంబానికి అందరూ భయపడతారు.

వేద(శార్వరి) కాలేజీలో చదువుకుంటూ బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటుంది. కానీ తక్కువ జాతికి చెందిన అమ్మాయి అని ప్రతాప్ సింగ్ తమ్ముడు ఆమెని ఏడిపించి కొట్టి అవమానిస్తాడు. కానీ ఆ అమ్మాయికి బాక్సింగ్ మీద ఉన్న ఆసక్తి చూసి అభిమన్యు ఆమెకి నేర్పిస్తాడు. అదే సమయంలో వేద అన్నయ్య ఊళ్ళో ఓ అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి లేచిపోతాడు. దీంతో పెళ్లి చేస్తామని పిలిపించి వాళ్ళిద్దర్నీ, వేద అక్కని చంపేస్తారు. వేదని కూడా చంపడానికి ప్రయత్నించగా అభిమన్యు అడ్డుపడతాడు. వేద కోర్టుని ఆశ్రయించాలనుకుంటుంది. వేద తన ఊరులో వాళ్ళని తప్పించుకొని కోర్టుకి వెళ్లిందా? అభిమన్యు వేదకు సపోర్ట్ గా ఎలా నిలబడ్డాడు? ప్రతాప్ సింగ్ మనుషులు వేదని పెట్టుకున్నారా? వేద కోర్టుకు వెళ్లిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Mr Bachchan : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా రివ్యూ.. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా..

సినిమా విశ్లేషణ.. గతంలో తక్కువ జాతి మనుషులని అగ్రకుల వర్ణాలు తొక్కేస్తున్నాయి అనే పాత పాయింట్ తో బోలెడు సినిమాలు వచ్చాయి. అదే పాత కథతో అదే పాత కథనంతో వేద సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అభిమన్యు టెర్రరిస్ట్ ని చంపడం, తన భార్య జ్ఞాపకాలతో బతుకుతుండటం, కాలేజీలో జాయిన్ అయి వేదకి బాక్సింగ్ నేర్పించడం, ఊళ్ళో అరాచకాలు చూడటం చూపిస్తారు.

ఇక సెకండ్ హాఫ్ అంతా ప్రతాప్ సింగ్ మనుషులు వేద వెనక పడటం, అభిమన్యు ఆ అమ్మాయిని కాపాడటం ఇలా టామ్ అండ్ జెర్రీ కథనంతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా సాగదీసినా సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లతో బాగానే ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే కోర్టులో న్యాయం దక్కుతుంది అనే పాయింట్ ని కొన్ని వాస్తవ సంఘటనలు తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. జాన్ అబ్రహం చాలా సెటిల్డ్ గా సింపుల్ పర్ఫార్మెన్స్ చేసాడు. శార్వారి మాత్రం తన నటనతో అదరగొట్టేసిందని చెప్పొచ్చు. తమన్నా గెస్ట్ పాత్రలో అక్కడక్కడా కనిపించి మెప్పించింది. అభిషేక్ బెనర్జీ విలన్ పాత్రలో బాగా నటించాడు. మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఆశిష్ విద్యార్ధి.. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. పాత కథ, పాత కథనంతో డైరెక్టర్ విజువల్ గా మాత్రం బాగానే చూపించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘వేద’ సినిమాని నిమ్న వర్గాలను అగ్ర వర్ణాలు తొక్కేస్తున్నాయి అనే పాత కథతో యాక్షన్ సినిమాగా చూపించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు