Mr Bachchan : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా రివ్యూ.. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా..

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా ఓ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ చేసే రైడ్ కథలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలా చూపించారు.

Mr Bachchan : మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా రివ్యూ.. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా..

Raviteja Harish Shankar Mr Bachchan Movie Review and Rating

Mr Bachchan Movie Review : హరీష్ శంకర్ – మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబోలో వచ్చిన సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో TG విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా ఆగ‌స్టు 15న రిలీజ్ కాబోతుండగా నేడు ఆగస్టు 14 సాయంత్రం నుంచే అనేక చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా బాలీవుడ్ అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. ఆనంద్ బచ్చన్(రవితేజ) ఓ సిన్సియర్ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. సమాజంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి అతని నల్లధనాన్ని పట్టుకోవడంతో పాటు ఆఫీస్ లో అతన్ని, అతనికి సపోర్ట్ చేసిన సీనియర్ ఆఫీసర్ ని అవమానించడంతో ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయాక తన ఊరు కోటిపల్లికి వచ్చి గతంలో తాను నడిపిన ఆర్కెస్ట్రా నడుపుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జిక్కితో(భాగ్యశ్రీ బోర్సే) ప్రేమలో పడతాడు. ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లనెలా ఇవ్వాలి అని జిక్కి పేరెంట్స్ ప్రశించినప్పుడే మళ్ళీ అతని ఉద్యోగం తిరిగి వస్తుంది.

ఈ సారి తన ఊరికి దగ్గర్లోనే ఉండే ముత్యం జగ్గయ్య(జగపతిబాబు) అనే ఓ MP ఇంట్లో రైడ్ చేయమని ఆదేశాలు వస్తాయి. దీంతో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని రైడ్ కి వెళ్తాడు బచ్చన్. మరి రైడ్ లో జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు. అక్కడ నల్లధనం దొరికిందా? జిక్కి తో బచ్చన్ పెళ్లి అయిందా? అసలు ఈ బచ్చన్ పేరు కథేంటి తెలియాలంటే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ తెరపై చూడాల్సిందే.

Also Read : Mahesh Babu : కాలినడకన తిరుమలకు చేరుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు ఫ్యామిలీ..

సినిమా విశ్లేషణ.. హరిశ్ శంకర్ రీమేక్ లు తీసినా వాటిని బాగా తీస్తాడు అనే పేరు ఉంది. దీంతో హిందీలో రైడ్ అనే సీరియస్ సబ్జెక్టు అయినా దానిని హరీష్ శంకర్ తన స్టైల్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో చూపిస్తాడు అనుకున్నారు. కానీ సినిమాలో అసలు పాయింట్ రైడ్ అయితే దాన్ని వదిలేసి దాని చుట్టూ పాటలు, ఫైట్స్, లవ్ స్టోరీ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ బచ్చన్ జాబ్ పోయి ఊరికి రావడం, ఊర్లో జిక్కిని చూసి ప్రేమలో పడి ఆమె వెనక తిరగడం, ఆర్కిస్ట్రాలో పాటలు పాడటం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత హిందీ పాటలు, హీరోయిన్ తో సీన్స్ తోనే బాగా సాగదీశారు.

ఇంటర్వెల్ ముందు జాబ్ వచ్చిందని, జగ్గయ్య ఇంటిపై రైడ్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా రైడ్ సినిమాలో లాగా ఆసక్తిగా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎలా బయటకు తీశారు అని ఉంటుందేమో అనుకుంటారు. కానీ అసలు రైడ్ అంతా ఓ 15 నిముషాలు చూపించి మిగిలినదంతా అక్కడ కూడా హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ తో సాంగ్స్, కామెడీతోనే సాగదీశారు.

సినిమాలో సత్య అక్కడక్కడా నవ్విస్తాడు. సినిమాలో లాజిక్స్ అస్సలు వెతకొద్దు. కొన్ని సీన్స్ అయితే క్రింజ్ లా అనిపిస్తాయి. ఓ యువ స్టార్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ తో అదరగొట్టాడు. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్ రిఫరెన్స్ లు, పాత అమితాబ్ సాంగ్స్ మాత్రం బాగా వాడుకున్నారు మొత్తానికి హీరోయిన్ అందం కోసం, రెండు మాస్ సాంగ్స్ కోసం, కాసేపు సత్య కామెడీ కోసం, పాత హిందీ పాటల కోసం మాత్రం సినిమాకి వెళ్లొచ్చు.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. రవితేజ ఏ సినిమాకైనా చాలా కష్టపడతాడని తెలిసిందే.ఈ సినిమాకి కూడా తన ఎనర్జీని అంతా పెట్టి ఫుల్ యాక్టివ్ గా నటించాడు. భాగ్యశ్రీ భోర్సే మాత్రం తన అందంతో అందర్నీ మెప్పిస్తుంది. నటనలో పర్వాలేదనిపించింది. జగపతి బాబు విలన్ పాత్రలో బాగా నటించాడు. సత్య తన కామెడీతో నవ్విస్తాడు. తనికెళ్ళ భరణి, గౌతమి, సచిన్ ఖేద్కర్, శుభలేఖ సుధాకర్.. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. ఎప్పుడూ మెలోడీ మ్యూజిక్ తో మెప్పించే మిక్కీ జె మేయర్ ఈ సారి ఫుల్ మాస్ సాంగ్స్, మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. కథ బాలీవుడ్ సినిమాది తీసుకున్నా కథనం మాత్రం చాలా రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలా రాసుకున్నారు. దర్శకత్వం పరంగా హరీష్ శంకర్ బాగానే తీసినా తన రీమేక్ మార్క్ ఎక్కడో మిస్ అయిందనిపిస్తుంది. పీపుల్ మీడియా సంస్థ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సినిమా ఓ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ చేసే రైడ్ కథలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలా చూపించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తగత అభిప్రాయం మాత్రమే.