Su From So
Su From So Movie Review : కన్నడలో ఇటీవల రిలీజయిన ‘సు ఫ్రం సో’ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ నేడు ఆగస్ట్ 8న రిలీజ్ చేస్తున్నారు. రాజ్ బి శెట్టి, షనీల్ గౌతమ్, JP తుమినాడ్, సంధ్య అరకెరె.. పలువురు ముఖ్య పాత్రల్లో జెపి తుమినాడ్ దర్శకత్వంలో శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలస, రాజ్ బి శెట్టి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికొస్తే.. ఓ ఊరిలో ఒక చావు, పెళ్లితో కథమొదలయి అన్ని పాత్రలను అక్కడే పరిచయం చేస్తారు. అశోక్(జెపి తుమినాడ్) పెళ్లిలో తాగి వెళ్లిపోతుంటే ఎవరో అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుంది అనుకోని దొంగతనంగా చూస్తాడు. అది కొంతమంది చూసి అశోక్ ని పట్టుకోడానికి వస్తే పారిపోతాడు. కానీ అశోక్ చేసే హడావిడికి వాళ్ళు దయ్యమేమో అని భయపడుతుంటే దయ్యం వచ్చినట్టు యాక్ట్ చేసి పడిపోతాడు. దీంతో ఊరంతా అశోక్ కి దయ్యం పట్టింది అని వైరల్ అవుతుంది.
ఊరి పెద్ద రవన్న(షనీల్ గౌతమ్) ఆ సమయంలో లేకపోవడంతో వేరే పెద్ద మనుషులు కొంతమంది ఓ పూజారిని తీసుకొస్తారు. అశోక్ సరదాగా వాళ్ళని ఆడుకోవడానికి భయపెడతాడు. దీంతో అశోక్ కి నిజంగానే దయ్యం పట్టిందని అనుకుంటారు. అశోక్ లో ఉన్న ఆత్మ ఎవరిదో కనుక్కోడానికి ట్రై చేస్తే సరదాగా కాంచన అని చెప్తే అది తప్పుగా అర్థమయి సులోచన అంటారు. ఓ పెద్దమనిషి సులోచన సోమేశ్వరం నుంచి అంట అని అందరికి చెప్తాడు. దీంతో దయ్యాన్ని పోగొట్టడానికి కరుణాజీ స్వామిజి(రాజ్ బి శెట్టి)ని తీసుకొస్తారు. స్వామిజి వచ్చి సులోచన ఎవరో సోమేశ్వరంకి వెళ్లి కనుక్కోండి తను ఎందుకు వస్తుందో తెలుస్తుంది అని అశోక్ లో ఉన్న దయ్యాన్ని పంపిస్తానని ఏవేవో ప్రయోగాలు చేస్తాడు. ఆ ప్రయోగాలకు అశోక్ భయపడి దయ్యం వెళ్ళిపోయింది అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు.
రవన్న, కొంతమంది పెద్ద మనుషులు సోమేశ్వరానికి వెళ్తే అక్కడ నిజంగానే సులోచన అనే ఆమె చనిపోయి ఉంటుంది. ఆమె కూతురు ఒక్కతే ఉంటుంది. అసలు దయ్యమే పట్టని అశోక్ ఊరంతా భయపడుతూ చేసే పనులకు ఎలా ఇబ్బంది పడ్డాడు? సులోచన ఎవరు? సులోచన కథేంటి? వాళ్ళ అమ్మ ఆత్మ వచ్చిందని నమ్మి సులోచన కూతురు ఏం చేసింది? అశోక్ లో నుంచి సులోచన వెళ్లిపోయిందని ఊరివాళ్లంతా ఎప్పుడు నమ్ముతారు? స్వామిజి ఏం చేసాడు ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. రాజ్ బి శెట్టి సినిమాలంటే కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అయితే ఇందులో రాజ్ శెట్టి స్వామిజి పాత్రలో మాత్రమే నటించాడు. కర్ణాటకలో తన కూతురు పెళ్ళికి తల్లి ఆత్మ వచ్చింది అనే వార్తను తీసుకొని హారర్ కామెడీగా బాగానే రాసుకున్నారు. సినిమా మొదలయిన దగ్గర్నుంచి నవ్వుతూనే ఉంటాము. కొన్ని సీన్స్ లో అయితే పడీ పడీ నవ్వాల్సిందే. అయితే సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఆ మెసేజ్ ని బలంగా అందరికి కనెక్ట్ అయ్యేలా చెప్తారు. అలాగే ఓ లవ్ స్టోరీ కూడా బాగుంటుంది.
ఎక్కడా బోర్ కొట్టకుండా నవ్విస్తూనే చివర్లో కాస్త ఎమోషనల్ చేసి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు హారర్ కామెడీ అంటే ఒక పాత బంగ్లానో, నిజం దయ్యంతో కామెడీనో, హీరో, అతని ఫ్రెండ్స్ తో కథ నడపడమో చేసారు. కానీ అసలు దయ్యమే పట్టని ఓ వ్యక్తికి దయ్యం పట్టిందని ఊరంతా చేసే హడావిడి, వాళ్ళ భయం మనకు కొత్త కథలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీయడం, అక్కడ జనాలు ఎలా ఉంటారు అంటూ రియాల్టీగా చూపించడం ఇంకా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా హారర్ తో భయపెట్టారు కూడా. సులోచన ఫ్రమ్ సోమేశ్వరంను ‘సు ఫ్రమ్ సో’ అని టైటిల్ కి న్యాయం చేసారు. థియేటర్లో ఫుల్ గా నవ్వుకోడానికి ‘సు ఫ్రం సో’ చూసేయొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. స్వామిజీ పాత్రలో తన నటనతో ఎప్పట్లాగే రాజ్ బి శెట్టి అదరగొట్టేసాడు. తన పాత్రతో ఫుల్ గా నవ్విస్తాడు. అశోక్ పాత్రలో JP తుమినాడ్ కూడా మెయిన్ లీడ్ లో బాగా నటించాడు. క్లైమాక్స్ లో అయితే తన పర్ఫార్మెన్స్ తో అందర్నీ మెప్పిస్తాడు. రవన్న పాత్రలో షనీల్ గౌతమ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తోనే నవ్విస్తాడు. సంధ్య అరకెరె ఒక మంచి ఎమోషనల్ పాత్రలో మెప్పిస్తుంది. సినిమాలో ఉన్న మిగతా కన్నడ నటీనటులంతా వారి పాత్రల్లో నటిస్తూ మనల్ని నవ్వించారు. పుష్పరాజ్ బోలార్ అనే నటుడు మాత్రం హడావిడి చేసే పాత్రలో, బాగా తాగే పాత్రలో అందర్నీ పడీ పడీ నవ్వేలా చేస్తాడు.
Also Read : War2 : వార్ 2 నుంచి ‘సలాం అనాలి’ సాంగ్ టీజర్.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్-హృతిక్
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా అదిరిపోయాయి. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. లొకేషన్స్ కూడా రియల్ లొకేషన్స్ లో చాలా సహజంగా చిత్రీకరించారు. ఒక కొత్త కథని తీసుకొని మంచి కామెడీ హారర్ గా ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఓ పక్క మెయిన్ లీడ్ లో నటిస్తూ మరో పక్క దర్శకుడిగా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు తుమినాడ్. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సు ఫ్రం సో’ ఒక కొత్త కథతో కామెడీ హారర్ గా థియేటర్లో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించే సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.