Satyabhama : ‘సత్యభామ’ మూవీ రివ్యూ.. పెళ్లి తర్వాత యాక్షన్ అదరగొట్టిన కాజల్..

కాజల్ యాక్షన్ సీన్స్ కోసం అయినా ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే.

Kajal Aggarwal Action Thriller Movie Satyabhama Review and Rating

Satyabhama Movie Review : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) పెళ్లి తర్వాత తెలుగులో ‘సత్యభామ’ సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే, సమర్పణలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సత్యభామ సినిమా తెరకెక్కింది. క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సత్యభామ సినిమా నేడు జూన్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. సత్యభామ(కాజల్ అగర్వాల్) షీ టీమ్స్ లో ACP ఆఫీసర్. అమ్మాయిలను ఏడిపించే వాళ్ళను, అమ్మాయిలకు సమస్యలు సృష్టించే వాళ్లను పట్టుకుంటూ ఉంటుంది. తన దగ్గరకు ఓ రోజు హసీనా(నేహా పఠాన్) అనే అమ్మాయి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ఎదు(అనిరుధ్ పవిత్రన్) తో బ్రేకప్ అయినా రోజూ ఇబ్బంది పెడుతున్నాడని, ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నట్టు కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన ఎదు హసీనా ఇంటికి వచ్చి ఆమె మీద దాడి చేస్తాడు. హసీనా సత్యభామకు కాల్ చేసినా ఆమె వచ్చేసరికి సత్యభామ కళ్ళ ముందే హసీనాను చంపేస్తాడు. ఈ క్రమంలో సత్యభామ ఎదుని కాల్చబోయి తన గన్ లో బులెట్స్ వేస్ట్ చేస్తుంది. దీంతో పై ఆఫీసర్స్ సత్యభామను గన్ సరెండ్ చేయమని షీ టీమ్స్ నుంచి వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు.

అయితే తన కళ్ళ ముందే హసీనా చనిపోవడం, చనిపోతూ తన తమ్ముడు ఇక్బాల్(ప్రజ్వల్) ని చూసుకోమని చెప్పడంతో ఆ బాధ ఇంకా గుర్తొస్తూ ఉంటుంది సత్యభామకు. దీంతో ఆ ఎదుని వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు డాక్టర్ చదువుతున్న హసీనా తమ్ముడు ఇక్బాల్ మిస్ అవ్వడంతో సత్యభామ ఆ కేసు టేకప్ చేస్తుంది. దీంట్లో ఓ ఎంపీ తనయుడు రిషి(అంకిత్)కి సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు ఇక్బాల్ ఏమయ్యాడు? రిషికి, ఇక్బాల్ కి లింక్ ఏంటి? హసీనాను చంపిన ఎదు దొరికాడా? సత్యభామ ఈ రెండు కేసుల్ని ఎలా డీల్ చేసింది? సత్యభామ భర్త అమర్(నవీన్ చంద్ర) ఏం చేస్తాడు? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Love Mouli : ‘లవ్ మౌళి’ రివ్యూ.. ప్రేమ గురించి నవదీప్ కొత్తగా ఏం చెప్పాడు?

సినిమా విశ్లేషణ.. కాజల్ అగర్వాల్ పెళ్లి, పిల్లలు తర్వాత కంబ్యాక్ ఇవ్వడం, అందులోను మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో యాక్షన్స్ చేస్తూ రావడంతో ముందు నుంచి సత్యభామ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ లో విలన్ ని హీరో ఎలా దొరకపట్టాడు అన్నట్టు సాగుతుంది. అయితే ఇందులో కూడా అదే పాయింట్ ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం కష్టంగా రాసుకొని కథను ఎటెటో తీసుకెళ్ళిపోతారు. హసీనాను చంపిన యదుని, మిస్ అయిన ఇక్బాల్ ని వెతికే ప్రయత్నంలో ఈ కథని వుమెన్ ట్రాఫికింగ్, గేమింగ్, టెర్రరిజం, మెడికల్.. ఇలా రకరకాల పాయింట్స్ నుంచి తీసుకెళ్తారు. దీంతో కొంత కన్ఫ్యూజ్ గా, ఇదంతా అవసరమా అని అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లేని ఆసక్తిగా చెప్పడానికి ఈ పాయింట్స్ అన్ని తీసుకొచ్చారు అని భావించాలి.

అలాగే కథలో చాలా సార్లు వెనక్కి వెళ్తుంటారు. ట్విస్ట్ లు రివీల్ చేయడానికి కథలో వెనక్కి వెళ్తే ఆసక్తిగానే ఉంటుంది కానీ మనుషుల గురించి తెలుసుకోడానికి కూడా కథలో వెనక్కి తీసుకెళ్తే కొంచెం కష్టమే. అయితే సత్యభామ సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కి ఇచ్చిన హీరోయిక్ ఎలివేషన్స్, తను చేసిన యాక్షన్ సీన్స్ మాత్రం ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం పక్కా. అయితే ఇలాంటి విలన్ ని పట్టుకునే థ్రిల్లర్ సినిమాల్లో క్లైమాక్స్ చాలా భారీ యాక్షన్ తో ఊహించుకుంటాం. కానీ సత్యభామలో ఎమోషన్ సీన్స్ తో ఆసక్తిగా ముగించడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. దాదాపు 20 ఏళ్లుగా తన నటనతో మెప్పిస్తున్న కాజల్ మొదటి సారి యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టేసింది. హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు నటించింది. అలాగే ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పిస్తుంది. ఈ సినిమా కోసం కాజల్ ఎక్కువే కష్టపడినట్టు తెరపై అర్థమైపోతుంది. నవీన్ చంద్ర కాజల్ భర్తగా కూల్ గా ఉండే వ్యక్తిగా అలరించాడు. యూట్యూబర్ నేహా పఠాన్ హసీనా పాత్రలో ఎమోషనల్ గా మెప్పిస్తుంది. ప్రజ్వల్, అంకిత్, అనిరుధ్, సంపద.. తమ పాత్రల్లో బాగానే నటించారు. హర్షవర్ధన్, రవివర్మ, ప్రకాష్ రాజ్.. పోలీసాఫీసర్స్ గా అక్కడక్కడా కనపడ్డారు.

సాంకేతిక విషయాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఇక శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థ్రిల్లర్ సినిమాలకు తన BGM అదిరిపోతుంది అని అందరూ చెప్పినట్టే ఈ సినిమాలో కూడా అదరగొట్టాడు. పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. ముఖ్యంగా సత్యభామలో కాజల్ తో యాక్షన్ సీక్వెన్స్ లు ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు చాలా బాగా డిజైన్ చేశాడు. కాజల్ చేసే యాక్షన్ సీన్స్ కోసమైనా సత్యభామ చూడాల్సిందే. ఇక కథ పరంగా పాతదే అయినా ఇందులో వేరే అంశాలు తీసుకొచ్చి స్క్రీన్ ప్లే ని కొత్తగా థ్రిల్లర్ గా రాసుకున్నాడు శశికిరణ్ తిక్కా. ఇక దర్శకుడు సుమన్ చిక్కాల మొదటి సారి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా స్టార్ హీరోయిన్ సినిమా కాబట్టి నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు. ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తన పనితనంతో రెగ్యులర్ గా మెప్పిస్తునే ఈ సినిమాని కూడా చాలా పర్ఫెక్ట్ గా కట్ చేయడమే కాక ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేసాడు.

మొత్తంగా సత్యభామ సినిమా తన కళ్ళ ముందే ఓ అమ్మాయిని చంపేసిన వ్యక్తిని పట్టుకోడానికి ఒక లేడి పోలీసాఫీసర్ ఏం చేసింది అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా చూపించారు. కాజల్ యాక్షన్ సీన్స్ కోసం అయినా ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు