నందమూరి కళ్యాణ్ రామ్ మాస్ మసాలా మూవీస్ కి కేరాఫ్.. కెరీర్ ఆరంభం నుండి కూడా రొటీన్ అండ్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్.. ఇటీవలి కాలంలో కొత్త తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందుకే కళ్యాణ్ రామ్ కొత్త సినిమా 118 మీద కాస్త క్యూరియాసిటీ ఏర్పడింది. కొత్తగా ఎదో చెయ్యాలి అని తపిస్తున్న కళ్యాణ్ రామ్ 118 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ పై ముందు నుండి కూడా మంచి అంచనాలే ఉండగా.. ఈ సినిమా టైటిల్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేయడంతో సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూశారు ప్రేక్షకులు. అసలు ఈ సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
Read Also : టీడీపీలో టిక్కెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా!
కథ
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గౌతమ్(కళ్యాణ్ రామ్)కి నిద్రలో ఒక వింత కల ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఆ కలలో ఎవరో ఒక అమ్మాయిని ఎవరో కొడుతున్నట్లు లోయలో తోసేసినట్లు కనిపిస్తుంది. అయితే కలలో వచ్చిన విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి కలల స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ని గౌతమ్ కలుస్తాడు. డాక్టర్ ని కలిశాక గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్(షాలిని పాండే), ఫ్రెండ్ ప్రభాస్ శీనుతో కలిసి ఆ అమ్మాయి మరణం గురించి ఇన్వెస్టిగేషన్ మొదలెడుతారు. వారు ఆ అమ్మాయి గురించి తెలుసుకునే క్రమంలో ఆ అమ్మాయి పేరు ఆద్య అని తెలుసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో గౌతమ్ కు అనేక సమస్యలతో ఎదురవడంతో పాటు.. అనేక క్లూలు కూడా దొరుకుతాయి. అసలు ఈ ఆద్య ఎవరు? ఆమె మరణించి గౌతమ్ కలలో ఎలా కనిపించింది? ఆద్య అనే అమ్మాయి నిజంగానే ఉందా? ఆద్య అసలు నిజంగానే మరణించిందా? గౌతమ్ మిస్టరీని ఎలా చేదించాడు? అనేదే 118 మిగిలిన కథ.
నటీనటులు
ఇదివరకెప్పుడూ చేయని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా బాగా చేశాడు. ఇటీవలికాలంలో కొత్తగా కనిపిస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ సినిమాలో కూడా డిఫ్రెంట్ లుక్ లో కనిపించాడు. తనకొచ్చే కల విషయంలో వర్రీ అవుతూనే.. దాన్ని ఛేదించే క్రమంలో కళ్యాణ్ రామ్ ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. అయితే థ్రిల్ మోడ్ ని చూపించే క్రమంలో ఎక్కువ చోట్ల ఒకే తరహా హావభావాలను రిపీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటాపోటీగా నటించినా… ఆద్యగా నివేత థామస్ నటన సినిమాకి హైలెట్ కాగా మరో హీరోయిన్ షాలిని పాండే కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది. స్పెషల్ డాక్టర్ గా నాజర్, ఈస్టర్ గా మిస్ అయిన అమ్మాయి పాత్రలో హరితేజ ఆకట్టుకున్నారు. ప్రభాస్ శ్రీనుకి చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. కానీ కామెడీ టైమింగ్ కి ఆ పాత్రని పెద్దగా వాడుకోలేదు. ఉన్నంతలో అతను బాగానే చేసాడు. హరితేజ, నాజర్, శ్రవణ్, భరత్ రెడ్డి తదతరులకు గెస్ట్ అప్పీరెన్స్ లాంటి పాత్రలు దక్కాయి.
టెక్నీషియన్స్ విషయానికొస్తే..
ఇప్పటివరకు అనేక బిగ్గెస్ట్ హిట్ మూవీస్ కి సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహించిన గుహన్ 118 సినిమాతో తెలుగులో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.గతంలో తెలుగు హిట్ మూవీ హ్యాపీ డేస్ ని తమిళ్ లో డైరెక్టర్ గా రీమేక్ చేసిన గుహన్ ఈ సారిమాత్రం ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. సినిమా లైన్ పరంగా కాస్త వెయిట్ ఉంది. లైన్ ను డీల్ చేసిన విధానం కూడా పర్లేదు. కాకపోతే అంత చిన్న లిమిటెడ్ లైన్ లో చాలా అంశాలు టచ్ చెయ్యాలనే అతని తాపత్రయం కాస్త ఇబ్బందిగా అనిపించింది. పైగా థ్రిల్లర్ మోడ్ ని పూర్తిగా ఎలివేట్ చెయ్యలేకపోయాడు. ఫ్లాష్ బ్యాక్ కూడా కాస్త రొటీన్ లైన్స్ లోనే సాగింది.
Read Also : బిన్ లాడెన్ కొడుకు పౌరసత్వం రద్దు.. ఆచూకీ ఇస్తే భారీ నజరానా
ఫ్లాష్ బ్యాక్ లోని ఎమోషన్ పూర్తిగా క్యారీ కాలేదు.ఇక అతను టచ్ చేసిన ల్యూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ రియాలిటీ కి దూరంగా ఉంది.సినిమాకి 118 అనే టైటిల్ ని పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన గుహన్ ఆ టైటిల్ కి ఇచ్చిన జస్టిఫికేషన్ మాత్రం చాలా నార్మల్ గా అనిపించింది.ఈ సినిమావరకు డైరెక్టర్ గా కొంతవరకు సక్సెస్ అయిన గుహన్ సినిమాటోగ్రాఫర్ గా మాత్రం ఫుల్ మార్క్స్ స్కోర్ చేసాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఎస్సెట్.ఇక పాటల పరంగా పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఆర్.ఆర్ పరంగా మాత్రం సినిమాకి అవసరమయిన, సినిమాలో థ్రిల్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ అందించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
అంతగా ఎలివేట్ కాని థ్రిల్,
సెకండ్ హాఫ్ సాగదీత,
లాజిక్ లేని సీన్స్,
ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్
ఓవరాల్ గా చెప్పాలంటే.. 118 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఇటువంటి జోనర్ సినిమాలు ఇష్టపడేవాళ్ళను కొంతవరకు మెప్పిస్తుంది. కళ్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు ఫలించినా పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.