Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’ మూవీ రివ్యూ.. తండ్రి కోసం ఇద్దరు కొడుకులు ఏం చేశారు?

బెదురులంక లాంటి హిట్ సినిమా తర్వాత కార్తికేయ నేడు ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Kartikeya Iswarya Menon Bhaje Vaayu Vegam Movie Review and Rating

Bhaje Vaayu Vegam Movie Review : బెదురులంక లాంటి హిట్ సినిమా తర్వాత కార్తికేయ నేడు ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీల‌క పాత్ర‌ పోషించాడు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పిన భజే వాయు వేగం సినిమా నేడు మే 31న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. చిన్నప్పుడు వెంకట్(కార్తికేయ) వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో రాజు(రాహుల్) వాళ్ళ నాన్న లచ్చన్న(తణికెళ్ల భరణి) వెంకట్ ని దగ్గరికి తీసుకుంటాడు. వెంకట్ కి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో క్రికెట్ మీదే ఫోకస్ పెడతాడు. కెరీర్ కోసం వెంకట్, రాజు ఇద్దరూ హైదరాబాద్ కు వెళ్తారు. రాజుకి బ్యాక్ డోర్ జాబ్ కోసం లచ్చన్న ఊళ్లో పొలం అమ్మేసి డబ్బులు ఇస్తాడు. మరోవైపు వెంకట్ క్రికెట్ బాగా ఆడినా స్టేట్ టీంలోకి తీసుకోవాలంటే 10 లక్షలు అడగడంతో డబ్బులు లేకపోవడంతో బెట్టింగులు వేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ అని తెలియడంతో రాజు జాబ్ పోతే ఓ హోటల్లో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ విషయాలు ఏవి వాళ్ళ నాన్నకు తెలియకుండా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మాత్రం బాగా సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు.

అనుకోకుండా ఈ విషయం వాళ్ల నాన్నకు తెలిసి హాస్పిటల్లో చేరుతారు. వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించడానికి 20 లక్షలు కావాల్సి వస్తుంది. డబ్బులు కోసం వెంకట్ పెద్ద బెట్టింగ్ వేస్తాడు. అదే సమయంలో రాజు కూడా డబ్బులు ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. అదే సమయంలో వెంకట్ లవర్ ఇందు ఓ ట్విస్ట్ ఇస్తుంది. అసలు వాళ్ళ నాన్న ఆపరేషన్ కి డబ్బులు వచ్చాయా? వెంకట్ బెట్టింగ్ లో గెలిచాడా? ఇందు ఏం ట్విస్ట్ ఇచ్చింది.? హైదరాబాద్ మేయర్ జార్జ్, వాళ్ళ తమ్ముడు డేవిడ్ కి, వెంకట్ కి సంబంధం ఏంటి అని తెలియాలంటే సినిమాని తెరపై చూడాల్సిందే.

Also Read : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వ‌క్‌లోని మాస్ యాంగిల్‌ను మ‌రో కోణంలో..!

సినిమా విశ్లేషణ.. సినిమా అంతా ఫాదర్ ఎమోషన్ తోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వెంకట్, రాజుల నేపథ్యం, వాళ్ళ కష్టాలు చూపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం నిదానంగా సాగుతుంది అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ ఆసక్తిగా చూపించారు. ఫైట్స్, పాటలు తక్కువ ఉన్నా సినిమాని ఎమోషన్ తో నడిపించి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తారు. ఫాదర్ ఎమోషన్ కథకి ట్విస్టులతో థ్రిల్లింగ్ గా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. కార్తికేయ క్రికెటర్ గా, తండ్రి కోసం బాధపడే కొడుకుగా మెప్పించాడు. ఐశ్వర్య మీనన్ ఇందు పాత్రలో లోకల్ బస్తీల్లో ఉండే అమ్మాయిగా కనపడి అలరించింది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ చాలా రోజుల తర్వాత కనపడి అదరగొట్టేసాడు. ముఖ్యంగా రాహుల్ ఎమోషన్ సీన్స్ లో మెప్పించాడు. ఈ సినిమాతో రాహుల్ కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విలన్ గా రవిశంకర్ పవర్ ఫుల్ గా కనిపించాడు. తండ్రిగా తనికెళ్ళ భరణి కూడా ఎమోషన్ తో కట్టిపడేసారు. శరత్ లోహితశ్వ, పృథ్వి.. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఉన్న ఒక్క సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ సీన్స్ కి తగ్గట్టు బాగానే ఉన్నా కొన్ని చోట్ల అవసరం లేకపోయినా క్లోజ్ షాట్స్ పెట్టారు అనిపిస్తుంది. కథ, కథనం రెండూ కొత్తగా రాసుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక యూవీ సంస్థ అంటే నిర్మాణ విలువలు రిచ్ గా ఉంటుందని తెలిసిందే.

మొత్తంగా ‘భజే వాయు వేగం’ సినిమా తండ్రి కోసం ఇద్దరు కొడుకులు ఏం చేశారు అని ఎమోషనల్ గా ట్విస్టులతో థ్రిల్లింగ్ గా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.