నాకా, భయమా?.. అన్నపూర్ణలో షూటింగ్ స్టార్ట్ చేసిన కిచ్చా సుదీప్..

కరోనా కారణంగా పలు ఇండస్ట్రీలలో షూటింగులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల తిరిగి కొన్ని సీరియల్స్ షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ కేసులు పెరగడంతో చాలా వరకు ఆపేశారు. అయితే షూటింగ్ చేయడానికి ఎవరు భయపడ్డా! తానేం తగ్గేది లేదు అని అంటున్నారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ప్రభుత్వాలు షూటింగ్స్‌ను కొన్ని విధి విధానాల్లో చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే తెలుగు హీరోలు తమ షూటింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో కిచ్చా సుదీప్ మాత్రం ముందడుగేశారు.ఆయన హీరోగా నటిస్తున్న ‘ఫాంటమ్’ మూవీ షూటింగ్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు సుదీప్. తక్కువ మంది సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాలతో షూట్ చేస్తున్నామని, యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ పిక్స్ షేర్ చేశారు కిచ్చా సుదీప్.