Kishkindhapuri Review : ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ.. బెల్లంకొండ, అనుపమ ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కిష్కింధపురి మూవీ రివ్యూ.. (Kishkindhapuri Review)

Kishkindhapuri Review

Kishkindhapuri Review : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కిష్కింధపురి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, మకరంద దేశపాండే, సుదర్శన్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కిష్కింధపురి సినిమా రేపు సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Kishkindhapuri Review)

కథ విషయానికొస్తే.. రాఘవ్(బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ పరమేశ్వరన్), మరో వ్యక్తి(సుదర్శన్) కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ అని చేస్తూ ఉంటారు. దయ్యాలు, వాటి కథల మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమందిని పాడుబడిన బంగ్లాలకు తీసుకెళ్లి అక్కడ దయ్యాలు ఉన్నట్టు ముందే వీళ్ళే సెటప్ చేసుకొని వీళ్ళతో వచ్చిన వాళ్లందరికీ అక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నట్టు నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనుకోకుండా కిష్కింధపురి దగ్గర్లో ఉన్న సువర్ణమయ రేడియో స్టేషన్ కి వీళ్ళు ప్లాన్, ప్రిపరేషన్ లేకుండా వెళ్లాల్సి వస్తుంది.

రాఘవ, మైథిలితో పాటు మరి కొంతమంది కలిసి అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ నిజంగానే ఓ వాయిస్ వినిపించడం, దయ్యాలు ఉన్నట్టు వీళ్లకు అర్దమవడంతో అందరూ ఎలాగోలా తప్పించుకొని వస్తారు. ఆ తర్వాత ఈ బ్యాచ్ లో వరుసగా ముగ్గురు చనిపోవడంతో రాఘవ ఈ సమస్య నుంచి అందర్నీ ఎలాగైనా బయటపడాలని ఆ దయ్యానికి ఎదురెళ్తాడు. వేదవతి అనే పేరుతో లేడీ వాయిస్ తో చలామణి అవుతున్న ఆ దయ్యం విశ్రవపుత్ర అనే అబ్బాయి అని తెలుస్తుంది. అసలు విశ్రవపుత్ర ఎవరు? ఆ దయ్యం వేదవతి అని అందరూ ఎందుకు అనుకుంటున్నారు? రేడియోలో వచ్చే వాయిస్ ఎవరిది? వేదవతి ఎవరు? రాఘవ మిగిలిన వాళ్ళందర్నీ కాపాడాడా? అసలు ఆ సువర్ణమయి రేడియో స్టేషన్ కథ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Telusu Kada : ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్.. ఇద్దరమ్మాయిలతో సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్..

సినిమా విశ్లేషణ..

మాస్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటం, అనుపమతో కలిసి మళ్ళీ పనిచేయడం, ట్రైలర్ కూడా బాగుండటంతో కిష్కింధపురి సినిమాపై మొదట్నుంచి ఆసక్తి నెలకొంది. మొదట హీరో ఎలివేషన్ కోసం పెట్టిన సీన్స్ రొటీన్ అనిపిస్తాయి. అక్కడ CGI వర్క్స్ కూడా ఇంకా బెటర్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. తర్వాత ఆదితో కామెడీ కాస్త ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు.

వీళ్ళు కిష్కింధపురి కి వెళ్లిన దగ్గర్నుంచి అసలు కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. వరుసగా చనిపోవడం, అక్కడ వచ్చే హారర్ సీన్స్ తో భయపెట్టడమే కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు ఆ దయ్యం ఎవరు అని వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథ కొత్తగానే ఉంటుంది. ఆ కథకు – రేడియో స్టేషన్ కి బాగానే లింక్ చేసారు. హీరోకి చెందిన ఫ్లాష్ బ్యాక్ అవసర్లేదు అనిపిస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ అయ్యాక వచ్చే హారర్ సీన్స్, యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి. క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. చివర్లో దేవుడి సపోర్ట్ తో దయ్యాన్ని అంతం చేయడం అనే రొటీన్ కథనం. కిష్కింధపురి పార్ట్ 2 కి లీడ్ ఇచ్చి వదిలేయడంతో అసలు కథేంటి అనే కుతూహలంతో బయటకు వస్తారు.

సినిమాలో బాగానే భయపెట్టారు. సినిమా నిడివి రెండు గంటలే కావడం ప్లస్. కొన్ని లాజిక్స్ వదిలేయడాలు, చిన్న చిన్న సందేహాలు రావడం కామన్. కొన్ని చోట్ల డే, నైట్ కంటిన్యుటీ సీన్స్ మిస్ అయినట్టు నిపిస్తుంది. రాఘవ – మైథిలి లవర్స్ అని, కలిసి ఉన్నట్టు చూపిస్తారు కానీ వాళ్ళ కథేంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇక కిష్కింధపురి అనే టైటిల్ కి మొదట కోతులతో ఒక సీన్ కి కనెక్ట్ చేసుకోవడం తప్ప, సినిమాలో ఊరి పేరు తప్ప ఎక్కడా కనెక్ట్ అవ్వదు. దాని బదులు సువర్ణమయి రేడియో స్టేషన్ అని పెట్టాల్సింది అనిపిస్తుంది సినిమా చూశాక.(Kishkindhapuri Review)

నటీనటుల పర్ఫార్మెన్స్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ తోనే కాక మంచి నటనతో మెప్పించాడు. శ్రీనివాస్ తన నటన చూపించడానికి మంచి స్కోప్ దొరికింది ఈ సినిమాలో. ఇక అనుపమ అయితే అదరగొట్టేసింది. మొదట్లో సింపుల్ అమ్మాయిగా కనిపించినా సెకండ్ హాఫ్ లో దయ్యం పట్టిన పాత్రలో తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది.

విశ్వర పుత్ర పాత్రలో తమిళ నటుడు, డ్యాన్స్ మాస్టర్ శాండీ అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా చాలా బాగా నటించాడు. ఆది, సుదర్శన్ కామెడీ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. తనికెళ్ళ భరణి చిన్న పాత్రలో కనపడ్డారు. మకరంద దేశపాండే చివర్లో స్వామిజిగా బాగానే నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ.. ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. హారర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగుంటే అంత భయపడతారు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే బాగా భయపెట్టారు. పాటలు మాత్రం యావరేజ్. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్. ఆర్ట్ డైరెక్టర్ సెట్స్ కోసం, బూత్ బంగ్లా కోసం బాగానే కష్టపడ్డట్టు తెలుస్తుంది. డైరెక్టర్ ఒక కొత్త పాయింట్ తో హారర్ కథని రాసుకున్నా కథనం మాత్రం రొటీన్ గానే ఉన్నా బాగా భయపెట్టడానికి ప్రయత్నించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కిష్కింధపురి’ సినిమా ఓ హారర్ థ్రిల్లర్ కథనంతో ప్రేక్షకులను బాగానే భయపెడుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.