Komatireddy Venkat Reddy : తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరో తెలుసా? పాతికేళ్ల రాజకీయ అనుభవం..
కొత్త ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అనే అంశం టాలీవుడ్ లో చర్చగా మారింది.

Komatireddy Venkat Reddy is the New Cinematography Minister of Telangana
Komatireddy Venkat Reddy : తెలంగాణలో(Telangana) కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) బాధ్యతలు చేపట్టగా పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో ఎవరికీ ఏ శాఖ ఇస్తున్నారో అని గత కొన్ని రోజులుగా చర్చలు సాగగా నేడు ఉదయం మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ మార్పుతో సినీ పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇకపై సినీ పరిశ్రమ ఎలా ఉండనుంది? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు?.. అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ వచ్చిన దగ్గర్నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా (Cinematography Minister) ఉన్నారు. సినిమా ఈవెంట్స్ లో, సేవా కార్యక్రమాల్లో, సినిమా వారి ప్రోగ్రామ్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటూ తలసాని సినీ పరిశ్రమకు దగ్గరగా ఉన్నారనే చెప్పొచ్చు. ఇక తలసానితో పాటు కేటీఆర్ కూడా సినిమా వాళ్ళతో క్లోజ్ గా ఉంటూ సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించారు. దీంతో కొత్త ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అనే అంశం టాలీవుడ్ లో చర్చగా మారింది.
నేడు ఉదయం మంత్రి పదవులు కేటాయించగా సినిమాటోగ్రఫీ శాఖను నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటాయించారు. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖతో పాటు రోడ్లు, భవనాల శాఖ కూడా కేటాయించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో నాలుగు సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత భువనగిరి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మరోసారి నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో దాదాపు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో కూడా మంత్రిగా సేవలు అందించారు.
ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా పెద్దలు వెళ్లి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలిసి అభినందిస్తామని తెలిపారు. ఈ క్రమలో సినిమాటోగ్రఫీ మంత్రిని ప్రకటించగా త్వరలోనే సినీ పెద్దలు వెళ్లి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. సినీ పరిశ్రమకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సహాయసహకారాలు అందిస్తారని టాలీవుడ్ ఆశిస్తుంది.