Koratala Siva : ఏడేళ్లుగా ‘శ్రీమంతుడు’ రచ్చ.. సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు..

ఏడేళ్లుగా 'శ్రీమంతుడు' రచ్చ. నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టుకి, ఇప్పుడు సుప్రీమ్ కోర్టుకి. అయితే అన్నిచోట్ల కొరటాల శివకు చుక్కెదురు.

Koratala Siva facing rejection at supreme court in srimanthudu issue

Koratala Siva : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈమధ్య వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నారు. మొన్నటివరకు ‘ఆచార్య’ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ తో గొడవ, ఇప్పుడు తాజాగా ఏడేళ్ల క్రిందటి ‘శ్రీమంతుడు’ గొడవ కూడా తెరపైకి వచ్చింది. ఈ గొడవ ఏమి కొత్తది కాదు, గత ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అసలు గొడవ ఏంటంటే.. శ్రీమంతుడు సినిమా కథని స్వాతి పత్రికలో తాను ప్రచురించిన కథ నుంచి కాపీ కొట్టారంటూ రచయిత శరత్‌ చంద్ర 2017లో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. నాంపల్లి కోర్టులో శరత్‌ చంద్ర వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివ పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కథను కాపీ కొట్టారు అనేందుకు ఉన్న ఆధారాలను శరత్‌ చంద్ర హైకోర్టులో కూడా సమర్పించడంతో.. హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్ధించింది.

Also read : Dil Raju : రవితేజ కోసం సందీప్ కిషన్ వెనక్కి తగ్గాడు.. కానీ ఆ ఇద్దరు మాత్రం..

దీంతో హైకోర్టులో కూడా చుక్కెదురైందని కొరటాల శివ సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించారు. సినిమా విడుదలైన 8 నెలలకు శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని, ఈ విషయాలను హైకోర్టు, స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల శివ తరపు న్యాయవాది, వైసిపి ఎంపి నిరంజన్‌ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఇక కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన ధర్మాసనం.. రచయిత సంఘం నివేదిక ఆదారంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు, స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొరటాల శివ క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది.

కొరటాల వేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని, ఆ పిటిషన్ ని డిస్మిస్‌ చేస్తామని లేదా వెనక్కి తీసుకుంటారా అని కొరటాల శివ న్యాయవాదిని ప్రశ్నించగా.. తాము పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని తెలియజేసారు. దీంతో న్యాయస్థానం కూడా అందుకు అనుమతించింది. ఇక సుప్రీమ్ కోర్టులో కూడా కొరటాలకు చుక్కెదురు అవ్వడంతో.. ఇప్పుడు ఆ క్రిమినల్‌ కేసుని కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.