Dil Raju : రవితేజ కోసం సందీప్ కిషన్ వెనక్కి తగ్గాడు.. కానీ ఆ ఇద్దరు మాత్రం..
సంక్రాంతి రేసులో ఇతర సినిమాల కోసం తన సినిమాని పోస్టుపోన్ చేసుకున్న రవితేజ కోసం సందీప్ కిషన్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు. కానీ ఆ ఇద్దరు మాత్రం..

Dil Raju said Sundeep Kishan Ooru Peru Bhairavakona postpone for Raviteja Eagle
Dil Raju : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు తెలుగు నిర్మాతలు గట్టిగా పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సినిమాలకు థియేటర్స్ కేటాయించడం కష్టమవుతుండడంతో తెలుగు ఫిలిం ఛాంబర్.. ఒకటి రెండు సినిమాలను వాయిదా వేసుకోవాలని కోరింది. ఇక ఆ విజ్ఞప్తిని గౌరవించి రవితేజ ‘ఈగల్’ మూవీ నిర్మాతలైన పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. తమ సినిమాని వాయిదా వేసుకున్నారు.
ఈగల్ నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించిన ఫిల్మ్ ఛాంబర్.. వారి సినిమా రిలీజ్ కి సోలో డేట్ ఇస్తామంటూ మాటిచ్చారు. ఈక్రమంలోనే ఫిబ్రవరి 9న విడుదల చేసుకునేందుకు ఈగల్ కి డేట్ ఇచ్చారు. కానీ అదే తేదికి సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’, యాత్ర 2 సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి. దీంతో ఫిలిం ఛాంబర్ తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి భైరవకోన, లాల్ సలామ్, యాత్ర 2 ని వాయిదా వేసుకోవాలని కోరింది.
Also read : Dil Raju : సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం.. చిరంజీవిని కూడా కలిసి.. సమస్యలను పరిష్కరించుకుంటాము..
ఈ విన్నపాన్ని భైరవకోన మూవీ టీం అర్ధం చేసుకొని తమ సినిమాని వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 16న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇక మిగిలిన రెండు సినిమాలు లాల్ సలామ్, యాత్ర 2 మాత్రం వాయిదా వేసుకోమని తెలియజేశారట. ఈ విషయాన్ని ఈగల్ నిర్మాతలకు తెలియజేస్తే.. వాళ్ళు ఇబ్బంది లేదు, తమ సినిమాని అదే డేట్ కి రిలీజ్ చేసేస్తామని పీపుల్స్ మీడియా వాళ్ళు పేర్కొన్నారట.
అయితే సంక్రాంతి సమయంలో తమ నిర్ణయాన్ని గౌరవించి పోస్టుపోన్ చేసుకున్న ఈగల్ చిత్రానికి.. ఇప్పుడు ఇతర రెండు సినిమాలు కంటే, ఎక్కువ థియేటర్స్ ని దొరికేలా చేస్తామని దిల్ రాజు మాటిచ్చారు. ఈగల్ మూవీ రిలీజ్ కి ఎక్కువ స్క్రీన్స్ ని కేటాయిస్తామంటూ పేర్కొన్నారు. కాగా యాత్ర 2 సినిమా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతుంది. లాల్ సలామ్ విషయానికి వస్తే.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తుంటే, రజినీకాంత్ కేవలం ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.